- మంత్రి సీతక్కపై రాహుల్ ప్రశంసలు
- సమ్మక్క-సారలమ్మ వీరగాధ తెలుసుకున్న రాహుల్
- వచ్చే జాతరకు కచ్చితంగా వస్తామన్న ఖర్గే, రాహుల్
ఢిల్లీ, మహా : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ మంత్రులతో కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు అభినందించారు. ఆదివాసీల అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరపై సుమారు పది నిమిషాల పాటు చర్చ జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ.. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రి సీతక్కను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క–సారలమ్మల పోరాట గాథను ఖర్గే, రాహుల్ ఆసక్తిగా విన్నారు. సమ్మక్క – సారలమ్మల చరిత్రను దేశవ్యాప్తంగా చాటేందుకు సినిమా తీయాలని రాహుల్ గాంధీ సూచించారు.
సరదా సంభాషణ..
పార్టీ సమావేశంలో మంత్రి సీతక్క, రాహుల్ గాంధీ మధ్య సరదా సంభాషణ జరిగింది. మేడారం జాతరకు ఆహ్వానిస్తే తాము తప్పకుండా హాజరయ్యేవారమని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఆహ్వానిస్తే తాను కూడా తల్లుల దర్శనానికి వచ్చే వాడిని’ అని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అయితే సమయాభావం వల్ల వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినట్లు మంత్రి సీతక్క వివరించారు. వచ్చే జాతరకు తప్పకుండా అధికారిక ఆహ్వానం అందిస్తామని సీతక్క అన్నారు. ‘ఆహ్వానం అందితే తప్పకుండా వస్తాము’ అని రాహుల్ గాంధీ, ఖర్గే హామీ ఇచ్చారు.







