Mahaa Daily Exclusive

  వనస్థలిపురంలో దారుణం..

Share

  • వనస్థలిపురంలో దారుణం
  • -రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందని మాజీ భార్యను పొడిచి చంపిన మాజీ భర్త
  • వనస్థలిపురం పరిధి గ్రీన్‌సిటీ కాలనీలో దారుణం

వనస్థలిపురం, మహా
వనస్థలిపురం పరిధి గ్రీన్‌సిటీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని కెనడా వెళ్లిన ఆ దంపతులను మనస్పర్థలు వేరు చేశాయి. 8 నెలలకే భార్య భారత్‌కు తిరిగి వచ్చేసింది. భర్తపై కేసు పెట్టడంతో అతను కూడా స్వదేశానికి రావాల్సి వచ్చింది. కొన్నాళ్లకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆమె ఓ ఉద్యోగంలో చేరి రెండో పెళ్లి చేసుకుంది. అతనికి మాత్రం కెనడా వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో అతడు పగతో రగిలిపోయాడు. నా జీవితం నాశమైపోయింది. తను మాత్రం సంతోషంగా ఉంటోందని కోపం పెంచుకున్నాడు. పక్కా పథకం ప్రకారం ఆమె ఎక్కడ ఉంటుందనే ఆచూకీ తెలుసుకున్నాడు. చివరికి దారుణానికి ఒడిగట్టాడు.

2025లో మరో వివాహం

పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన దేవరకొండ మహేశ్‌కు మహారాష్ట్రలోని చంద్రపుర్‌ జిల్లా బల్లార్పూర్‌ మండలం తిలక్‌వాడ్‌ గ్రామానికి చెందిన బుద్దార్థి సునీతతో 2022లో వివాహం జరిగింది. సునీత కుటుంబం ఏళ్ల క్రితం మహారాష్ట్రలో స్థిరపడింది. వివాహం తర్వాత మహేశ్‌తో కలిసి సునీత కెనడా వెళ్లారు. 8 నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సునీత భారత్‌కు తిరిగివచ్చింది. మహారాష్ట్రలోని బ్రహ్మపురి పోలీస్‌ స్టేషన్‌లో భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పోలీసులు మహేశ్‌ మీద లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో మహేశ్‌ భారత్‌కు తిరిగిరావాల్సి వచ్చింది. 2024లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. సునీత ఆ తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలో వనస్థలిపురంలో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉడుకుల శ్రీనాథ్‌తో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. సునీత తన పూర్వ వివాహం గురించి శ్రీనాథ్‌కు చెప్పలేదు. 2025లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. సునీత ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. వనస్థలిపురంలోని గ్రీన్‌సిటీ కాలనీలో భర్త, అత్తతో కలిసి ఉంటోంది.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అడ్రస్

దేవరకొండ మహేశ్‌ తల్లి ఇటీవల మరణించారు. కుమారుడి కేసుకు సంబంధించి ఆలోచిస్తూ, మథపడుతూ ఆమె గుండెపోటుతో చనిపోయారు. ఈ కార్యక్రమాల అనంతరం మహేశ్‌ తిరిగి కెనడా వెళ్లేందుకు ప్రయత్నించగా సునీత పెట్టిన కేసు విచారణ కారణంగా వీసా రాలేదు. మరోవైపు సునీత రెండో వివాహం చేసుకుని సంతోషంగా ఉండటంతో మరింత కక్ష పెంచుకున్నాడు. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సునీత ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ సంపాదించాడు. ఆమె చేసే రీల్స్‌ అన్నీ చూస్తూ పరిసరాలను గుర్తించాడు. హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఉన్నట్లు తెలుసుకున్నాడు.

నేరుగా ఇంటికి వచ్చి

మహేశ్‌ నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ప్రైవేటు వసతి గృహంలో ఉన్నాడు. సునీత ఆచూకీ కనుగొని హత్య కోసం ఈ-కామర్స్‌ యాప్‌లో కొబ్బరి బొండాలు నరికే కత్తి, చెట్లను కత్తిరించేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్‌ చైన్‌ సా, బండల్ని కత్తిరించే యంత్రం కొనుగోలు చేశాడు. ఒక డబ్బాలో పెట్రోలు కొని సిద్ధం చేసుకున్నాడు. మూడు రోజులు రెక్కీ చేశాడు. సునీత భర్త ఎప్పుడు బయటికి వెళ్తాడు? ఏ సమయంలో ఒంటరిగా ఉంటుందో తెలుసుకున్నాడు. సెల్ఫ్‌ డ్రైవ్‌ కారు అద్దెకు తీసుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో వనస్థలిపురంలో సునీత అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నాడు. లిఫ్ట్‌కు బదులు మెట్ల మార్గంలో నాలుగో అంతస్తుకు చేరుకుని తలుపుతట్టాడు. సునీత తలుపు తెరవగా ఇంట్లోకి వచ్చిన మహేశ్‌ ఆమెతో గొడవపడ్డాడు. గొడవ పడిన కాసేపటి తర్వాత సునీతను గదిలోకి లాక్కెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో మెడ, తలపై విచక్షణారహితంగా నరికాడు. అప్పటికే సునీత కేకలు విన్న అత్త లోపలికి వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న సునీతను చూసి గట్టిగా అరుస్తూ అపార్టుమెంటు వాసుల్ని పిలిచింది. ఇరుగుపొరుగు వచ్చేసరికి మహేశ్‌ లోపలి నుంచి గది తలుపులు పెట్టుకున్నాడు. ఎంత పిలిచినా బయటకు రాలేదు. లోపలికి వస్తే పెట్రోలు పోసి నిప్పంటించుకుంటానని బెదిరింపులకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టారు. అప్పటికే మహేశ్‌ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని లైటర్‌తో నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.మహేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడ్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Latest