- సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టు మరో ఊరట
- భూపాలపల్లి కోర్టు కేసు విచారణ
- హాజరు నుంచి మినహాయించిన హైకోర్టు
హైదరాబాద్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మరో భారీ ఊరటను కల్పించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన పలు కేసుల్లో భూపాలపల్లి కోర్టు ముందు హాజరు కావడాన్ని మినహాయింపును కల్పిస్తూ తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగాలకు సంబంధించి ఆధారాలు లేకుండా తనపై తీవ్ర ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి చేసిన ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై భూపాలపల్లి, మొగులపల్లి పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన ఈ రెండు కేసులను కొట్టి వేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఆ రెండు కేసుల్లో భూపాలపల్లి కోర్టుకు ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి హాజరు కావడాన్ని మినహాయిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఈ కేసులకు సంబంధించి గండ్ర వెంకటరమణా రెడ్డి తరఫు లాయర్ కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.








