- లైసెన్సు ఉన్న హుక్కా లాంజ్ లపై కేసులు రద్దు
- పోలీసుల చర్య చట్ట ప్రక్రియ దుర్వినియోగమే అన్న హైకోర్టు
హైదరాబాద్, మహా : లైసెన్సుతో నడుస్తున్న హుక్కా లాంజ్ నిర్వాహకులపై నమోదైన క్రిమినల్ కేసులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. స్పష్టమైన చట్ట ఉల్లంఘన లేకుండానే పోలీసులు కేసులు నమోదు చేయడం చట్ట ప్రక్రియను దుర్వినియోగ పరచడమే అని కోర్టు పోలీసులు చర్యలను తప్పు పట్టింది. నగరంలోని ఓ హుక్కా లాంజ్ పై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 223తో పాటు సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే నిర్వాహకులకు వర్తించే ట్రేడ్ లైసెన్సు, ఆహార భద్రత అనుమతులు ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయని కోర్టు గమనించింది. పోలీసులు చూపించిన ఆరోపణల్లో చట్టపరమైన స్పష్టత లేదని, సంబంధిత చట్టంలోని నిబంధనల ఉల్లంఘనను నిరూపించే ఆధారాలు లేవని న్యాయస్థానం తెలిపింది. కేవలం అనుమానాల ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడం సమంజసం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో హుక్కా లాంజ్ నిర్వాహకులపై నమోదైన కేసులను కోర్టు రద్దు చేస్తూ, చట్టాన్ని అమలు చేసే అధికార సంస్థలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించింది. భవిష్యత్ లో ఇలాంటి కేసులు నమోదు చేస్తే సహించేది లేదని స్పష్టం చేసింది.








