అమరావతి, మహా: ప్రజా రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు, భూ యజమానులకు చెల్లించాల్సిన వార్షిక కౌలును ఏపీ సీఆర్డీఏ (ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) రైతుల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేసింది. సాంకేతిక సమస్యలు, ప్లాట్ల అమ్మకాలు, మరణించిన రైతుల వారసుల వివరాలు అందకపోవడం వంటి కారణాలతో కొందరికి గతంలో కౌలు డబ్బులు అందలేదు. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించి మొత్తం 495 మందికి రూ.66.48 కోట్ల పెండింగ్ కౌలును సీఆర్డీఏ తాజాగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
గతంలో సమస్యలు-ఇప్పుడు లైన్ క్లియర్
గతంలో రైతుల బ్యాంకు ఖాతాల అనుసంధానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. కొందరు రైతులు తమకు కేటాయించిన ప్లాట్లను అమ్మేశారు. అలాగే, మరణించిన రైతుల వారసుల బ్యాంకు ఖాతాల వివరాలు సకాలంలో అధికారులకు చేరలేదు. ఈ కారణాల వల్ల పలువురు రైతుల ఖాతాల్లో 9వ, 10వ, 11వ సంవత్సరాలకు సంబంధించిన వార్షిక కౌలు డబ్బు జమ కాలేదు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించిన ఏపీ సీఆర్డీఏ, పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును విడుదల చేసింది. అమరావతిలో మొత్తం 495 మంది రైతులకు, భూ యజమానులకు రూ.66,480,402 చెల్లించింది. ఇందులో 9వ, 10వ సంవత్సరాలకు సంబంధించిన కౌలుగా 232 మందికి రూ.4,08,41,632 చెల్లించారు.
అలాగే, 11వ సంవత్సరానికి సంబంధించిన కౌలుగా 263 మందికి రూ.2,56,38,770 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు సీఆర్‌డీఏ కమిషనర్ తెలిపారు. ఈ చెల్లింపులతో రైతులు, భూ యజమానులు తమకు రావాల్సిన డబ్బును అందుకున్నారు. మొత్తానికి డబ్బులు జమ కావడంతో రైతులు ఆనందంలో ఉన్నారు.








