- ఎయిమ్స్ తరహాలో ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏర్పాటు
- త్వరలోనే మంజూరయ్యే అవకాశం
- ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్య మంత్రికి కూడా తెలియజేశాను
- కేంద్రం వెనుకంజ వేస్తోందంటూ తప్పుడు ప్రచారం తగదు
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మహా : ఆయుర్వేద ఇనిస్టిట్యూట్ ఏర్పాటులో కేంద్రం వెనుకంజ వేస్తోందని, దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోందంటూ మీడియాలో వస్తున్న కథనాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి సమాచారం లీకులిస్తూ కేంద్రంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ, ప్రాంతాలూ సమానమేనని స్పష్టం చేశారు. ఎయిమ్స్ తరహాలో తెలంగాణలోనూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను స్థాపించాలని కోరుతూ ఇప్పటికే తాను కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉందని, త్వరలోనే మంజూరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు సైతం సమాచారమిచ్చినట్లు పేర్కొన్నారు. ఆయుర్వేద ఇన్ స్టిట్యూట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ కు రాసిన లేఖను ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. అదే విధంగా కరీంనగర్ లో అత్యాధిక ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ దామోదర రాజనర్సింహకు తాను 4 నెలల క్రితమే (మే 27, 2025) లేఖ రాశానని, కానీ ఇప్పటి వరకు దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్ర మంత్రి పేషీలోనే పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు. దామోదర రాజనర్సింహకు రాసిన లేఖను సైతం కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు.
తెలంగాణలో సాంప్రదాయ ఆయుష్ వైద్యసేవలు, విద్యా అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘‘ఆయుర్వేద చికిత్సలపై స్థానికంగా మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, సంస్థాగత స్థాయిలో ఆయుర్వేద సేవలు లభ్యం కావడం లేదు. ఆసుపత్రికి అనుబంధంగా ఉండే కళాశాల ఏర్పడితే ప్రజలకు ఆయుర్వేద చికిత్సలను మరింతగా అందుబాటులోకి తీసుకురావొచ్చు. తెలంగాణలో ప్రస్తుతం అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు, నిపుణులు కొరత ఉంది. కొత్త కళాశాల ఏర్పాటు ద్వారా నూతన తరానికి శిక్షణ కల్పించడమే కాకుండా, స్థానిక ఆరోగ్య వ్యవస్థ బలపడుతుంది. దీనికితోడు ఆయుర్వేద విద్యను అభ్యసించాలంటే తెలంగాణ విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. స్థానికంగా కళాశాలను ఏర్పాటు చేయడంవల్ల వారికి అందుబాటు ధరల్లోనూ విద్యా అవకాశాలు లభిస్తాయి’’అని తెలిపారు. తెలంగాణలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద స్థాపనవల్ల రాష్ట్రానికి అనేక రకాలుగా ప్రయోజనాలు చేకూరనుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. అధిక ప్రమాణాల ఆయుర్వేద వైద్య సేవలను అందించడం ద్వారా, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించినట్లు భారతీయ సాంప్రదాయ వైద్య విద్యా పరిశోధనలను అభివృద్ధి చేయడం ద్వారా, ఉపాధి అవకాశాలు సృష్టించడం మరియు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. తాను ఈ అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ఆయుష్ మంత్రికి ఇటీవల లేఖ రాశానని, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అతి త్వరలోనే ఢిల్లీ, రాజస్తాన్, హర్యానా, గోవా తరహాలోనే తెలంగాణలోనూ ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మంజూరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాభివ్రుద్ది కోసం కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని, ఈ తరుణంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ గందరగోళం సృష్టించొద్దని కోరారు.







