ఇక బెనిఫిట్ షో లు తెలుగు రాష్ట్రాల్లో ఉండవా. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారుతోంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ తో తెలంగాణ ప్రభుత్వం ఇక బెనిఫిట్ షో .. టికెట్ రేట్ల పెంపుకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. దీంతో, సంక్రాంతి వేళ ప్రముఖ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో, ఇప్పుడు వసూల్లు .. టికెట్ ధరల పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాగా ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో లు రద్దు చేయాలనే చర్చ మొదలైంది. బీజేపీ, టీడీపీ నేతలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెబుతున్న వేళ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది.
బెనిఫిట్ షోల పై
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో లు.. టికెట్ ధరల పెంపు చర్చనీయాంశంగా మారింది. పుష్ఫ -2 బెనిఫిట్ షో ల టికెట్ ధరల పెంపు భారంగా భావించారు. అదే విధంగా బెనిఫిట్ షో ల సమయంలో చోటు చేసుకుంటున్న ఘటనలతో అసలు ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో టికెట్ ధరల పెంపుకు ఎందుకు అనుమతి ఇస్తున్నాయనే ప్రశ్నలు మొదలయ్యాయి. తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ తో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు.. టికెట్ ధరల పెంపు ఇక ఉండవని తేల్చి చెప్పింది. దీంతో, ఏపీ ప్రభుత్వం ఇదే తరహాలో నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కూటమి నేతలు ఇదే అంశం పైన స్పందించారు.
అవసరం లేదంటూ
అల్లు అర్జున్ అరెస్ట్ వివాదంపై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిందే వాస్తవమైతే ఆయనతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పిన ఆయన..ఇది తన వ్యక్తిగత అభిప్రాయంగా స్పష్టం చేశారు. ఎంత పెద్ద సెలబ్రెటీ అయినప్పటికీ అందరికీ చట్టం ఒక్కటే అని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందన్నారు. బెన్‌ఫిట్ షోలను తప్పకుండా ఆపివేయాలన్నదే తన అభిప్రాయమన్నారు. తొక్కిసలాట జరుగకుండా ఉండాలంటే బెన్‌ఫిట్‌షోలు రద్దు చేయడమే మంచిదన్నారు. ప్రజల ఉద్దేశాలను ప్రజాప్రతినిధుల ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ నిర్ణయం ఏంటి
ఒక వ్యక్తి చనిపోయారని చెప్పినప్పుడు.. హీరో అల్లు అర్జున్ బాధ్యతగా అక్కడ నుంచి వెళ్ళిపోవా ల్సిన అవసరం కూడా ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. అల్లు అర్జున్ వెళ్ళటం వల్లే ఇదంతా జరిగిందని స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. అదే విధంగా టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ స్పందించారు. గతంలో బెనిఫిట్ షో లు ప్రజలకు సహాయార్థం మాత్రమే వేసేవారని, గతంలో దీన్ని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తీసుకొచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు బెనిఫిట్ షోలు లాభార్జన కోసం వేస్తున్నారని వ్యాఖ్యానించారు. బెనిఫిట్ షో వేస్తే ఆ డబ్బులను ఆపదలో ఉన్న వారికి వినియోగించాలని డిమాండ్ చేసారు. దీంతో, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ బెనిఫిట్ షో ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.