కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. 55 వేల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ మంజూరు చేసి పనులు చెపట్టామని, దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తేవడం జరిగిందని, ఇవన్నీ యువతకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి విజయవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ఇన్చార్జ్ గా నియమించబడ్డ తర్వాత తొలిసారిగా మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అంటే తనకు ఇంత అభిమానం అని ఇక్కడ అనేక మంది నాయకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని, తెలంగాణను దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. అంత కలిసికట్టుగా పనిచేయాలని, పట్టభద్రుల ఎన్నికలను క్యాడర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అన్నారు.







