ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టభద్ర ఫైట్ కు ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. సోమవారం ఒకేరోజు మూడు జిల్లాల్లో సీఎం పర్యటించి పట్టభద్రుల ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటారు. పట్టభద్ర ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో సిట్టింగ్ సీటును నిలుపుకోవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో మోహరించడంతో పాటు నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జిలను నియమించి, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు జూమ్ మీటింగ్ లు నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ప్రచారం తీరును, గ్రౌండ్ రిపోర్ట్ ను ఎప్పటికపుడు తెలుసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ , ఉమ్మడి నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి పూర్తి అనుకూలంగా ఉందని భావిస్తున్ననేతలు పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్క కరీంనగర్ లోనే దాదాపు సగం ఓట్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం.. పార్టీ అభ్యర్ధి నరేందర్ రెడ్డి సొంత యంత్రాంగం గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు నిజామాబాద్, మద్యాహ్నం 1.3o గంటకు మంచిర్యాల, సాయంత్రం 3.30 గంటలకు కరీంనగర్ లలో జరిగే సభల్లో పాల్గొంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లాల మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజ నర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలు పాల్గొంటారు. ఓ వైపు పార్టీ ఎఐసిసి ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా రెండు జూమ్ మీటింగ్ లలో పాల్గొనడంతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. పిసిసి చీఫ్ గా ఎన్నికైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ కు తొలి ఛాలెంజ్ కావడంతో ఆయన నిర్విరామంగా పనిచేస్తున్నారు.
హోరాహోరీ
ఎన్నిక ఏదైనా ప్రచారం జరిగేటపుడు హోరాహోరీగానే కనిపిస్తోంది. తొలిసారి బిజెపి పట్టభద్ర గ్రౌండ్ లో గట్టిగా పోరాడుతోంది. బిజెపి అభ్యర్ధిగా సంగారెడ్డికి చెందిన అంజిరెడ్డిని ప్రకటించగా, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించింది. రెండు పార్టీలు కూడా పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితాలను తీసుకొని 25 లేక 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జీ, ఇద్దరు సహాయకులను నియమించి వారిని కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఓటర్లందరి ఫోన్నెంబర్లను కూడా సేకరించిన పార్టీలు మెస్సెజీలు, వాట్సాప్ సందేశాల ద్వారా, వీడియోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వారందరికీ ఆన్లైన్లో డబ్బు పంపించే ఏర్పాట్లు కూడా కొందరు చేస్తున్నారు. గ్రామకమిటీల ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అభ్యర్థులను గెలిపించు కోవడం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరి క్రిష్ణ కూడా పోటీ ఇస్తున్నారు. పట్టభద్ర రాజకీయం రసవత్తరంగా మారగా, సీఎం ఎంట్రీతో గేమ్ ఛేంజ్ అవుతుందని భావిస్తున్నారు. చివరి రెండురోజుల్లో పోటీ ఏకపక్షమయ్యే అవకాశాలున్నాయన్న అంచనాల్లో అధికారపార్టీ ఉంది. మరోవైపు బిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండగా.. బిజెపికి మద్దతుగానే సైడయిపోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
అందరికంటే ముందుగా..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కి పోటీ చేయాలనీ గత ఆరు నెలల నుండి నరేందర్ రెడ్డి ప్రణాళిక ప్రకారం పనిచేసుకున్నారు. అందుకు తగ్గట్టే ఓటర్ ఎన్ రోల్ మెంట్ కూడా ఉమ్మడి నాలుగు జిల్లా లో గ్రాడ్యుయేట్ లకు అవగాహన కల్పించి చేయించారు. తన కాలేజీ లో పనిచేసే సిబ్బంది ని పూర్తి గా ఉపయోగించుకున్నారు. ప్రతి నియోజకవర్గం కు ఒక ఇన్ ఛార్జిని పెట్టుకుని నెల నెల వేలల్లో జీతాలు ఇచ్చి పూర్తి స్థాయిలో పని తీసుకున్నారు. టికెట్ ప్రకటించేవరకు జాగ్రత్తగా పనిచేసిన నరేందర్ రెడ్డి తర్వాత నేతలను సమన్వయం చేసుకోవడంలో తడబడడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దుష్ప్రచారం భారీగా చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ , పిసిసి చీఫ్, మంత్రులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన తర్వాత గ్రౌండ్ మారుతూ వస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బిజెపి మూడుస్థానాల్లో పోటీచేస్తున్నా ఆ పార్టీకి అన్ని స్థాయిల్లో నాయకుల సహకారం అందడం లేదు. కరీంనగర్ తో పాటు నిజామాబాద్ జిల్లాల్లోనూ నేతలు అలకబూనారు. వీరిని సమన్వయం చేస్తూ ప్రచారవేడి కొనసాగించడం సవాల్ గా మారింది. ఇతర అభ్యర్ధుల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది కూడా గెలుపు ఓటములను ప్రభావితం చేయనుంది.







