హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌కి సంబంధించిన సర్వే పనులను ఆదివారం సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ సర్వే శరవేగంగా సాగుతుందన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందని, ఈ మార్గంలో మెట్రో రైలు వెళితే కేవలం 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ల తర్వాత నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆయన వివరించారు. దాదాపు 15 వేల ఎకరాల్లో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాగా, ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అత్యుధునిక సౌకర్యాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.







