రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. పర్యాటక ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశాల్లో, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ వసతి సదుపాయాల నిర్వహణ అనుకున్నంత మెరుగ్గా లేదు. దీంతో ఈ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు లీజు కింద అప్పగిస్తే భవనాల నిర్వహణ మెరుగుపడటంతో పాటు సంస్థకు ఆదాయం కూడా సమకూరుతుందని సర్కారు భావిస్తోంది. పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యం, మనోహర దృశ్యాల దృష్ట్యా వస్తున్న సందర్శకులు.. అక్కడున్న వసతి కూడా బాగుందని భావిస్తే ఆ విషయం విస్తృత ప్రచారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. అది రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్యను కూడా పెంచేందుకు ఉపకరిస్తుంది. ఇదే ఉద్దేశంతో పర్యాటక సంస్థ నడుపుతున్న పలు ఆస్తులను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని పలు పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల వద్ద హరిత ప్లాజాల పేరుతో స్టార్ హోటళ్ళను తలపించే విధంగా హోటళ్ళు, రెస్టారెంట్లను నిర్మించారు. ఇందులో కొన్ని చోట్ల హరిత ప్లాజాలు ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నప్పటికీ మెజారిటీ హోటళ్ళు పర్యాటక శాఖకు భారంగా మారాయి. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహణలో విపరీతమైన లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. సిబ్బంది పనితీరులో నిర్లిప్తత, పర్యవేక్షణాలోపం కూడా తోడవడంతో హరిత ప్లాజాలంటే పర్యాటకులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు తదితర ప్రాంతాలలోని పర్యాటక శాఖలో ఉన్న హోటళ్ళు, రిసార్ట్ లను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
సిబ్బంది కొరత
లీజు బకాయిలు రూ. 400 కోట్లు
సుమారు రూ.400 కోట్లకు పైగా పర్యాటక సంస్థకు లీజు బకాయిలు రావాల్సి ఉందని అంచనా. ఎప్పటికప్పుడు లీజు మొత్తాన్ని వసూలు చేయడానికి అవసరమైన యంత్రాంగం పర్యాటక సంస్థలో అందుబాటులో లేకపోవడంతో రూ.వందల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయినట్టు ఆరోపణలున్నాయి. రాజకీయ సిఫారసులతో పర్యాటక సంస్థ ఆస్తుల లీజు దక్కించుకున్న కొందరు బడా బాబులు రూ. కోట్ల బకాయిలు చెల్లించకుండా ముఖం చాటేశారు. మరికొంత మంది లీడజు కాలానికి మించి పర్యాటక భవనాలను వినియోగించుకుని తర్వాత బకాయిలను కూడా చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పేరుకు పోయిన బకాయిలను లెక్కించి సదరు లీజు దారుల నుంచి వసూలు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.







