ఆదిలాబాద్, మహా
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పడంతా వీటిపైనే చర్చ సాగుతోంది. సెప్టెంబర్‌లోగా ఎన్నికలు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం యంత్రాంగం ఇందుకు సన్నద్ధమవుతోంది. అప్పుడే పల్లెల్లోనూ ఎన్నికల వాతావరణం కనిపిస్తుండగా.. అందరి దృష్టి రిజర్వేషన్లపైనే కేంద్రీకృతం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దఫా రొటేషన్ పద్ధతి అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో ఎవరికి అనుకూలంగా వస్తుంది..ప్రతి కూలమెవరికోనని అప్పుడే ఆందోళన మొదలైంది. ఈ నెల నుంచే ఎన్నికల సందడి మొదలు కానుండగా.. ఈ నెలాఖరు లేదంటే ఆగస్టులో కచ్చితంగా ఉంటాయని భావిస్తున్నారు. అధికార యంత్రాంగం సైతం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమవుతోంది.
ఎవరికి అనుకూలమో..!
గత ప్రభుత్వం 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం స్థానిక సంస్థలకు పదేళ్ల ఏళ్ల పాటు (రెండు దఫాలు) ఒకే రిజర్వేషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వీటి ప్రకారమే ఎన్నికలు నిర్వహించగా..2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాజాగా ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టానికి 2024లో సవరణలు చేపట్టింది. దీని ప్రకారం ఒకే దఫా రిజర్వేషన్లు ఒకేసారి వర్తించడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడున్న రిజర్వేషన్లు తారుమారు కానున్నాయి. దీని ప్రకారం జడ్పీ ఛైర్మెన్ నుంచి సర్పంచ్ వరకు రిజర్వేషన్లు మారనున్నాయి. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతో పాటు పల్లెల్లో సర్పంచ్ పదవులకు ఏ రిజర్వేషన్ వస్తుందా అనేది అందరిలో ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు 166 ఉండగా.. జడ్పీటీసీ స్థానాలు 20 ఉండగా సర్పంచ్ స్థానాలు 473 ఉన్నాయి. వీటిలో పోటీ చేసేందుకు అనేక మంది ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందా లేదా అనేది వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వారికి అనుకూలంగా రాకపోతే వారి కుటుంబ సభ్యులు, బంధువులు లేదంటే తెలిసిన వారిలో దగ్గరి సంబంధీకులను పోటీలో నిలబెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పల్లెల్లో మొదలైన సందడి..!
ఇన్నాళ్లు పంచాయతీ ఎన్నికల కోసం ఆతృతగా ఎదురుచూసిన ఆశావహులకు హైకోర్టు తీర్పుతో ఆనందం వ్యక్తమైంది. ప్రభుత్వం కూడా త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుండటంతో పోటీ చేసే ఆశావహులు అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. గ్రామాల్లో అనుచరులను కూడగట్టడం, పరిచయాలు, పలకరింపులతో హడావుడి వాతావరణం కనిపిస్తోంది. ఇక ఆయా ప్రధాన పార్టీల తరపున పోటీ చేసేందుకు ఎవరికి వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పుడే టికెట్ల గోల సైతం ప్రారంభమైంది. తనకే టికెట్ వస్తుందంటే..తనకు వస్తుందని ముమ్మర ప్రచారం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయా పార్టీల కీలక నేతలను తరుచూ కలిస్తూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సర్పంచికి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండగా.. మరికొందరు ఎంపీటీసీ, జడ్పీటీసీ బరిలో ఉండాలని ఉవ్విళ్లూరుతున్నారు. రచ్చబండల దగ్గర సైతం ఎన్నికలపైనే చర్చలు సాగుతుండటం పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. మరోపక్క అధికార యంత్రాంగం సైతం ఇది వరకే ఏర్పాట్లు సిద్ధం చేయగా.. ఎన్నికల సంఘం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ్నుంచి ఆదేశాలు రాగానే తదుపరి కార్యాచరణ పూర్తిచేయాలని భావిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకాన్ని సైతం పూర్తి చేసి సిద్ధంగా ఉంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి జిల్లాలో స్థానిక ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.







