Mahaa Daily Exclusive

  పేద ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలి ఆస్పత్రి వైద్యాధికారులకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ప్రభుత్వ ఆసుపత్రికి పేద ప్రజలే వస్తారని, వారికి ఇబ్బందులు లేకుండా ఉత్తమ వైద్య సేవలు, సదుపాయాలు కల్పించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి అన్ని వార్డులకు స్వయంగా వెళ్లి, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సౌకర్యాలతో పాటు ఆసుపత్రికి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఆసుపత్రిలో వైద్యసేవలు, సదుపాయాలకు సంబంధించి అవసరమైనన్ని నిధులు మంజూరు చేయిస్తానని, పని చేయాల్సిన బాధ్యత మీదని.. నిధులు కేటాయించే బాధ్యత మాదని.. సేవలు అందించడంలో రాజీ పడొద్దని వైద్యాధికారులకు తెలిపారు. ఆసుపత్రిలో ఏవైనా వసతులు కావాలన్నా, మరమ్మతులు ఉంటే తాత్కాలికంగా వెంటనే ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అయినందున అందుకు తగ్గట్లుగానే అన్ని విభాగాల్లో సౌకర్యాలు ఉండాలన్నారు. వైద్యాధికారులు ఎక్కువ సమయాన్ని ఆసుపత్రికి కేటాయించాలని, ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరా, ఆరోగ్యశ్రీ, ఓపీ సేవల్లో అంతరాయం కలుగకుడా ఎప్పటికప్పుడు చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్యం, మంచినీటి వసతి వంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి పై అంతస్తు భవనం పైకప్పు లీకవుతోందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారిని ఆదేశించారు.

అనంతరం వైద్యాధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. సిటీ స్కాన్ తో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించాలని పలువురు అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ వీలైనంత త్వరగా సిటీ స్కానును ఏర్పాటు చేయాలని, దీంతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మళ్లీ నెల తరువాత ఆసుపత్రికి వస్తానని, సూచించిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మెడికల్ కళాశాల సూపరిటెండెంట్ నాగేందర్, అడిషనల్ డీఎంఏ డా. వాణి, ప్రిన్సిపాల్ డా.త్రివేణి, వైస్ ప్రిన్సిపాల్ డా. తఖియుద్దీన్, ఆర్ఎంఓలు జయమాల, రాజ్కుమార్, టీజీఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజినీర్ దేవేందర్, ఈఈ అజీజ్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ యాదయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Latest