ఖమ్మం,మహా.
ఆరోగ్యం బాగా ఉంటే వంద సమస్యలైనా పరిష్కరించవచ్చని, అనారోగ్యంతో ఉంటే అదే పెద్ద సమస్యగా తయారు అవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ పవిత్రమైన వైద్య వృత్తి చేస్తూ నేడు మనం వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. చిన్నతనం నుంచి చాలా మంది పిల్లలకు డాక్టర్ కావాలని ఆశ ఉంటుందని అన్నారు.
మనకు ఆరోగ్యం బాగుంటే బయట వంద సమస్యలు కనిపిస్తాయని, అదే అనారోగ్యంగా ఉంటే ఆ ఒక్కటే పెద్ద సమస్య అవుతుందని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కనపడే బయటి వంద సమస్యలను కూడా మనం పరిష్కరించు కోవచ్చని అన్నారు.
ఆరోగ్యంగా లేకుండా ఎన్ని ఆస్తులు ఉన్నా వృధా మాత్రమేనని అన్నారు. అటువంటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశ్యంతో వైద్యులు తీవ్రమైన ఒత్తిడిలో సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కలెక్టర్ ప్రశంసించారు.
ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించిన సమయంలో ఆ దేవుడి రూపంలో వైద్యుడు మనకి నయం చేసి పునర్జన్మ కల్పిస్తారని అన్నారు. రోగుల పట్ల మరింత మానవతా దృక్పథంతో మనమంతా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లా యంత్రాంగం నుంచి వైద్యులకు వంద శాతం అవసరమైన మద్దతు అందిస్తామని, ప్రతి ఒక్కరూ సంయుక్తంగా పనిచేసి ఖమ్మం జిల్లాను వైద్య రంగంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని, పేదలందరికీ మంచి వైద్యం అందాలని కలెక్టర్ తెలిపారు.
అనంతరం వైద్యులతో కలిసి కలెక్టర్ కేక్ కట్ చేసి సీనియర్ వైద్యులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కళావతి బాయి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించు కుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ 24 గంటల పాటు రోగులకు మెరుగైన చికిత్స అందించాలని తపించేవారని, ఆ స్ఫూర్తితో మనమంతా పనిచేయాలని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో వైద్యులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. సాధారణ ప్రసవాలు పెంచుతూ సిజెరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు ప్రస్తుతం కృషి చేస్తున్నామని అన్నారు. టీబీ నియంత్రణలో ఖమ్మం జిల్లాకు మంచి పేరు లభించిందని అన్నారు.
ఆరోగ్యమే మహా భాగ్యమని, కలెక్టర్ అధ్యక్షతన ఖమ్మం జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని, ప్రస్తుతం సీజనల్ వ్యాధుల నియంత్రణలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలని అన్నారు.
కార్యక్రమంలో *డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా, వరదల సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వైద్యులు కలిసి అద్భుతంగా పనిచేశారని అన్నారు. వ్యాధిని ట్రీట్ చేయడం కంటే వ్యాధి రాకుండా నివారించడం చాలా ఉత్తమమని అన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, వైద్యులు డాక్టర్ కృపా ఉషశ్రీ, ఐ.ఎం.ఏ. ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణ రావు, సెక్రటరీ జగదీష్, డాక్టర్ లు డాక్టర్ బి. శ్రీనివాస్ రావు, చందు నాయక్, వెంకటరమణ, బెజవాడ సైదులు, బిందు శ్రీరామారావు, మోతియా, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రచ్చ శ్రవణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, కోశాధికారి డాక్టర్ రత్న మనోహర్, సంబంధిత పిహెచ్సి,యూపీఎస్సీ వైద్యాధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








