Mahaa Daily Exclusive

  సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవ వేడుకలు-2025..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 1 (మహా):
కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో మంగళ వారం  జాతీయ డాక్టర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్  హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బీసీ రాయ్ అందించిన వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం 1991 నుండి ప్రతి ఏడాది జులై 1వ తేదీ ని డాక్టర్స్ డే గా జరుపుకుంటున్నామని తెలియజేశారు. ‘వైద్యో నారాయణో హరి’ అన్నది భారతీయ సంస్కృతి అని, ప్రాణం పోసేది బ్రహ్మ అయితే.. పునర్జన్మ నిచ్చేది వైద్యులని అన్నారు. వైద్యుడు దేవుడితో సమానమని కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది వైద్యుడినే అని పునరుద్ఘాటించారు. రోగికి ప్రమాదకరంగా ఉంటే ఏ సమయమైనా ఆస్పత్రికి చేరుకొని చికిత్స అందిస్తున్నందుకు సింగరేణి డాక్టర్లను అభినందించారు.
సింగరేణి సంస్థ కార్మికుల మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, సింగరేణి యాజమాన్యం ఎక్కడా కూడా ఖర్చుకు వెనుకాడక అత్యుత్తమ రీతిలో వైద్యం, పౌష్టికాహారం అందిస్తుందని, కార్మికులు వారి కుటుంబ సభ్యులు త్వరితగతిన కోలుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలియజేశారు. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో అన్ని రకాల సౌకర్యాలను మెరుగుపరచుకున్నామని, మరియు స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించుకున్నామని కనుక సాధ్యమైనంత మేరకు  రిఫరల్స్ ను తగ్గిస్తూ,  కార్మికులకు మెరుగైన వైధ్యాన్ని మన దగ్గరే అంధించాలని తెలిపారు. మందుల కొరతను కూడా అధిగమించామని తెలిపారు.
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్లు అందరూ పతిజ్ఞ చేశారు. అనంతరం ఉత్తమ సేవలందించిన డాక్టర్స్ మాలతి,  టి ఆనంద్ సుధాకర్, ఆర్.కృష్ణ మూర్తి, హనుమంత రావు, జే‌ఏ.రవి కుమార్ మరియు ఎస్.శ్రీనివాస రెడ్డిలకు  ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రధాన ఆసుపత్రి డాక్టర్లు అందరూ కలిసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్.కిరణ్ రాజ్ కుమార్, ఏ‌సి‌ఎం‌ఓ లు  ఎం.ఉష,  జి.సునీల, గైనకాలజిస్ట్ మాలతి, డి‌వై.పి‌ఎం పి బొశ్వంత్ అవినాష్, ఇతర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Latest