మంచిర్యాల, మహా : ఆదివాసుల ఆరాధ్య దైవం భీమన్న దేవుడి గుడిని పోల్చివేసిన ఫారెస్ట్ అధికారులను ఆదివాసీలు ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అని సిపిఎం జన్నారం మండల కార్యదర్శి అశోక్, లింగన్న లు ప్రశ్నించారు. జన్నారం మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల జూన్ 12న జన్నారం మండలం కోలం గూడాలో ఆదివాసుల కులదైవం భీమన్న దేవుని గుడిని ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. గుడి కూల్చివేతను అడ్డుకున్న ఆదివాసీల కుటుంబాలపై అటవీ అధికారులు కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగా ఈరోజు బుధవారం ఆదివాసీలైనటువంటి ఆత్రం రాజు ఇద్దరు కుమారులు ఆత్రం రవి, ఆత్రం సుధాకర్ లను ఫారెస్ట్ అధికారులు బలవంతంగా జీబులో ఎక్కించుకొని అక్రమ కేసు పెట్టి కోర్టులో హాజరు పరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఆదివాసీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరుచుకుపడుతున్నాయని అన్నారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు విగాతాలు కలిగిస్తూ అడవిలో జీవించకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. భీమన్న దేవాలయాన్ని కూల్చివేసిన అటవీ శాఖ అధికారులు సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన ఆదివాసీలను తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో బుచ్చన్న, లక్ష్మణ్, రాజన్న, యశోద, శంకర్ లు ఉన్నారు.








