ఆదిలాబాద్, మహా
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి అన్ని శాఖల సమన్వయం ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బాలల బాల్యం బడులకు అంకితం కావాలని, బాలలు కార్మికులుగా, కర్షకులుగా కొనసాగరాదని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకంగా బాలలను పిల్లలను కార్మికులుగా వినియోగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఆపరేషన్ ముస్కాన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రదేశంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ బాల కార్మికులను గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా పట్టణంలో యాచకులుగా ఉన్న చిన్నారుల పట్ల ప్రత్యేకంగా వ్యవహరిస్తూ వారిని సంక్షేమ గృహాలకు లేదా బడులకు తరలించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని ఆదివాసి ప్రజల పిల్లలు బాల కార్మికులుగా ఉన్నట్లయితే తల్లిదండ్రులకు సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వారిని బడిలో చేర్పించే విధంగా కృషి చేయాలని తెలిపారు. సమిష్టి కృషితో విజయం సాధించవచ్చని, బాల కార్మికుల వ్యవస్థను సమూలంగా శాశ్వతంగా నాశనం చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ తరపు నుండి సిసిఎస్ బృందం, షీ టీం బృందం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇద్దరు సిఐలతో కూడిన ముస్కాన్ బృందం సంసిద్ధంగా ఉంటూ బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, సీఐ లు చంద్రశేఖర్, గుణవంత్ రావు, పద్మ, అంజమ్మ, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, సీడబ్ల్యూసి ఛైర్మెన్ వెంకట స్వామి, డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








