Mahaa Daily Exclusive

  ఆయిల్ పామ్ సాగులో రైతులను ప్రోత్సహించాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్..!

Share

హన్మకొండ మహా ;

జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగులో రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగుకు తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు ప్రోత్సాహంపై ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల్లో ఆయిల్ పామ్ పంట సాగు గురించిన వివరాలను ఉద్యాన శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట ప్రాముఖ్యతను రైతులకు అధికారులు తెలియజేస్తూ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే విధంగా కృషి చేయాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఆయిల్ పాం పంట సాగును వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ప్రోత్సహించాలన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న ఆయిల్ పాం స్కీం ఈ సంవత్సరంతో ముగుస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెరికల్చర్ లో ప్రగతి సాధించాలని ఆ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ అధికారులతో ఈ సీజన్లో పంటల సాగు, పంటల నమోదు, రైతు బీమా, పీఎం కిసాన్ గురించి కలెక్టర్ సమీక్షించారు. సమావేశం అనంతరం ఉద్యాన శాఖకు సంబంధించిన బుక్ లెట్ కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనసూయ, సెరికల్చర్ అధికారులు సంజీవరావు, వెంకన్న, మండల వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest