వరంగల్ మహా;
గ్రేటర్ వరంగల్ మహానగరంలో ముంపు ప్రాంతాలు ఏటేటా పెరుగుతున్నాయని, నాలాల కబ్జా, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో చినుకు పడితే ముంపుకు గురి అవుతామని నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిడబ్ల్యూజీఎంసీ కమిషనర్ కు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. అనంతరం గంట రవికుమార్ మాట్లాడుతూ..
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో చిన్నపాటి వర్షానికే జనావాసాలు, కాలనీలు నీట మునుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఖిలా వరంగల్లోని అగర్తల చెరువు కాలువ ద్వారా శివనగర్ ప్రాంతం నుంచి వర్షపు నీరు శివనగర్, పెరిక వాడ, ఎస్.ఆర్.ఆర్ తోట అండర్ బ్రిడ్జి వంటి ప్రాంతాలను ముంచెత్తుతోందని సైడ్ డ్రైన్స్ లేకపోవడంతో సమస్య ఏటేటా తీవ్రమవుతోందని వాపోయారు. ఇప్పటి వరకు అగర్తల చెరువు నుంచి చేపట్టిన డ్రైనేజీ కాల్వ పనులు ఇంకా పూర్తి కాలేదని, గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు.
తగ్గిన భద్రకాళి చెరువు విస్తీర్ణం
భద్రకాళి ఆలయ ఆధునీకరణ పేరుతో చేపట్టిన ఐలాండ్, మాడ వీధుల పేరుతో చెరువు వైశాల్యాన్ని భారీగా తగ్గించారని, దీంతో ఇటు బొందివాగు నీరు చెరువులోకి వెళ్లే పరిస్థితి లేదని గంట రవికుమార్ పేర్కొన్నారు. భద్రకాళి చెరువు పూడిక తీత పనులు పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో సంతోషిమాత గుడి పరిసరాలు, హంటర్ రోడ్ తదితర ప్రాంతాలు మరింత నీట మునిగే ప్రమాదం లేకపోలేదని అన్నారు. అలాగే, ఇదే ప్రాంతంలో ఉత్తర, దక్షిణ భారతాన్ని కలిపే వరంగల్-కాజీపేట రైల్వే ట్రాక్ కూడా ముంపు పడడం ఖాయమన్నారు.
బొందివాగు పై దృష్టి సారించాలి..
ఎగువ నుంచి వరంగల్ మహా నగరంలోకి ప్రవేశించే బొంది వాగు సమస్యను పరిష్కరించడంలో ఏళ్ల నుంచి తాత్సారం జరుగుతోందని పాలకుల తీరును గంట రవికుమార్ దుయ్యబట్టారు. మామునూరు నుంచి భద్రకాళి చెరువు వరకు చాలాచోట్ల వాగు కబ్జాకు గురైందని, గతంలో విస్తరణ పనులు చేపట్టిన ఇంకా అవి పూర్తికాక పోవడం అధికారులు చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోందని ఎద్దేవా చేశారు. అలాగే, వరంగల్ దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువు వరద నీరు ఆటోనగర్, డాక్టర్స్ కాలనీ మీదుగా కోట చెరువుకు వెళ్లే నాలా పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, ఫలితంగా ముంపు ప్రాంతాలు మరింత ముంపునకు గురువుతున్నాయని స్పష్టం చేశారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి నాలా కబ్జా చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను
నగరంలో ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను అందుబాటులో ఉంచాలని గంట రవికుమార్ సూచించారు. బాధితులను సకాలంలో తరలించేందుకు తగిన బోట్లను కూడా సమ కూర్చాలన్నారు. సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు వేగవంతంగా చేపట్టేలా చూడాలని, మహానగరాన్ని ముంపు నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యకమ్రంలో బిజెపి కార్పొరేటర్లు ఆడేపు స్వప్న, గందె కల్పన, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకుల రఘునారెడ్డి, గడల కుమార్, జిల్లా కార్యదర్శి గోకే వెంకటేష్, కోశాధికారి కూచన క్రాంతి కుమార్, అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేష్, పెద్ది నవీన్, బిజెపి నాయకులు గందె నవీన్, ఆడెపు సదానందం, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బైరి మురళీకృష్ణ, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైరి నాగరాజు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నోముల రతన్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసు రాజు, పెద్ది నవీన్, బిజెపి మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, బిజెపి నాయకులు అంకాల జనార్ధన్, కందుకూరి శ్రీనివాస్, జెట్లింగ్ శివప్రసాద్,కొత్తపెళ్లి రాజేష్, సుంకరి రాజు, మహిళా మోర్చా నాయకురాలు కూరతోట రాజేశ్వరి, నిహారిక, పాల్గొన్నారు.








