హైదరాబాద్, మహా : సుప్రసిద్ధ పాత్రికేయుడు, ఆర్టీఐ మాజీ కమిషనర్, ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ అధ్యక్షుడు డాక్టర్ విజయబాబుకు 2025 సంవత్సరం ఎన్టీఆర్ సాహితీ అవార్డుని ప్రధానం చేశారు. రవీంద్ర భారతిలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి ఈ అవార్డుని ప్రదానం చేశారు . ఈ అవార్డుతో పాటు ఆధ్యాత్మిక రంగం నుంచి డాక్టర్ పి లలితా వాణి కి ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ, మూడు దశాబ్దాలుగా జాతీయస్థాయిలోని సుప్రసిద్ధ సాహితీ మూర్తుల్ని జ్ఞానపీట్ అవార్డు గ్రహీతలతో సహా అనేక మందిని ఏటా ఎన్టీఆర్ సాహితి అవార్డుతో సత్కరించుకున్నామని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ అవార్డుని తాను కొనసాగిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి ఇటు జర్నలిజం అటు సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్టులైన కొమ్మినేని శ్రీనివాసరావు, ఓలేటి పార్వతీశం, డాక్టర్ గౌరీ శంకర్, నల్లమోతు రాణి వంటి వారు హాజరు కావడం ఎంతో సమిచితంగా ఉందని లక్ష్మీపార్వతి అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, బహుముఖ ప్రజ్ఞాశాలి విజయబాబుకి ఈ అవార్డు ఇవ్వడం ఎంతో సమచితంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఆయన నిర్వహించిన కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. జర్నలిస్టుగా ఎన్టి రామారావు గారితో తనకున్న అనుభవాల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరొక ముఖ్య అతిథి డాక్టర్ ఓలేటి పార్వతీశం ఇటు సాహిత్య రంగంలో అటు న్యాయవాద రంగంలో కూడా విజయబాబు అందిస్తున్న సేవలు ప్రస్తావిస్తూ అభినందనలు తెలియజేశారు. మరొక ఆత్మీయ అతిథి, పూర్వ రిజిస్టర్ డాక్టర్ గౌరీ శంకర్ ప్రసంగిస్తూ, తెలుగుజాతికి తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన కృషి మరపురానిదన్నారు. అయితే ఆయన ప్రవేశపెట్టిన సంప్రదాయాలు తదనంతర కాలంలో అదృశ్యం కావడం బాధాకరమని ఆవేదన వెలిబుచ్చారు. డాక్టర్ విజయబాబుకు తెలుగు సంస్కృత భాషల పట్ల ఉన్న పట్టుని ఆయన అభినందించారు. సీతా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాణి నల్లమోతు ప్రసంగిస్తూ, లక్ష్మీపార్వతి గారి సాహితీ కార్యక్రమాలకు తమ వంతు
సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని తనకు ఎంతో ఆనందదాయకమని అన్నారు. అవార్డు గ్రహీత డాక్టర్ విజయబాబు తన స్పందన తెలియజేస్తూ, తెలుగు సినీ రమ్య హర్మ్యానికి ఎన్టీఆర్ మణిమయ రంజిత గోపురంగా భాసిల్లారని, రాజకీయాల్లోనూ సాహితీ సంస్కృతులకు ముఖ్యమంత్రిగా ఆయన పెద్దపీట వేశారని, ఆయా కార్యక్రమాల్లో ఆయనకు బాసటగా నిలిచిన డాక్టర్ లక్ష్మీపార్వతి గారి క్రియాశీలక పాత్ర మరువలేమన్నారు. కాళిదాసు సాహిత్యం లోతుగా అధ్యయనం చేసిన నందమూరి లక్ష్మీపార్వతి వంటి సాహితీ విద్వన్మణి రాజకీయాల్లో కుహనా రాజకీయ శక్తుల నుంచి అపనిందలు ఎదుర్కోవటం బాధాకరమని, ఆమె సాహితీ ప్రతిభ సాహిత్య లోకానికి
తెలుసున ని అన్నారు. మరొక పురస్కార గ్రహీత డాక్టర్ లలిత వాణి మాట్లాడుతూ ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలు పలుమార్లు చూసి తను తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేశానని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు శృతి అకాడమీ తరఫున డాక్టర్ శృతకీర్తి శిష్య ప్రశిష్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యంశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిల్లగట్టు శ్రీకాంత్ వ్యాఖ్యానం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జర్నలిస్టు మోహన్ కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు.








