Mahaa Daily Exclusive

  న‌ల్ల‌గండ్ల నాలా ప‌నుల‌కు తొల‌గిన ఆటంకాలు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా..!

Share

హైద‌రాబాద్‌, మహా : శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న న‌ల్ల‌గండ్ల ప్రాంతంలో వ‌ర‌ద నీరు సాఫీగా సాగేందుకు ఉన్న‌ ఆటంకాల‌ను హైడ్రా తొల‌గించింది. న‌ల్ల‌గండ్ల చెరువు నుంచి వ‌చ్చే వ‌ర‌ద నీటి కాలువ ప‌నులు ఇక జోరందుకోనున్నాయి. స్ట్రాట‌జిక్‌ నాలా డెవ‌ల‌ప్‌మెంట్ ప్రొగ్రాం కింద‌ 2 కిలోమీట‌ర్ల మేర ఈ వ‌ర‌ద నీటి కాలువ‌ను నిర్మిస్తున్న విష‌యం విధిత‌మే. ఈ నాలా చాలా చోట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యింది. కొన్ని చోట్ల ఇంటి య‌జ‌మానులు ముందుకొచ్చి ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌గా.. మ‌రి కొంత‌మంది అభ్యంత‌రాలు తెలిపారు. దీంతో నాలా ప‌నులు ముందుకు సాగ‌డం క‌ష్టంగా మారింది. ఈ త‌రుణంలో ఎస్ ఎన్‌డీపీ ప్రాజెక్టు నిర్వాహ‌కులు హైడ్రాను ఆశ్ర‌యించారు. ఇదే స‌మ‌యంలో నీటి ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి కూడా స్థానికులు హైడ్రాకు వ‌చ్చి ఫిర్యాదు చేశారు.

ఆటంకాలాను తొల‌గించిన హైడ్రా

2 కిలోమీట‌ర్ల మేర నిర్మించాల్సి ఉన్న నాలా కేవ‌లం.. 230 మీట‌ర్ల మేర పూర్త‌య్యింది. న‌ల్ల‌గండ్ల హుడా కాల‌నీలో స‌మ‌స్య త‌లెత్తింది. ఒక అపార్టుమెంట్ ప్ర‌హ‌రీతో పాటు కొంత నిర్మాణం నాలాపైనే ఉంది. ఇదే మాదిరి మ‌రి కొన్ని చోట్ల కూడా స‌మ‌స్య త‌లెత్త‌డంతో ఎస్ ఎన్‌డీపీ అధికారులు హైడ్రాను ఆశ్ర‌యించారు. శుక్ర‌వారం హైడ్రా రంగంలోకి దిగింది. నాలా ప‌రిధిలో ఉన్న నిర్మాణాన్ని హైడ్రా తొల‌గించింది. నాలాకు ఇరువైపులా ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి ప‌నులు జ‌రిగేందుకు అవ‌కాశం క‌ల్పించింది. న‌ల్ల‌గండ్ల చెరువు నుంచి మొద‌లై.. డాక్ట‌ర్స్ కాల‌నీ, రైల్ విహార్‌, న‌ల్ల‌గండ్ల హుడా కాల‌నీ, ఓల్డ్ శేరిలింగంప‌ల్లి విలేజ్‌, నేతాజీన‌గ‌ర్ మీదుగా.. బీహెచ్ఈఎల్ చౌర‌స్తా వ‌ద్ద ఉన్న ప్ర‌ధాన నాలాలో ఈ నాలా క‌లుస్తుంది. నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌వ్వ‌డంతో ప్ర‌తి ఏటా వ‌ర్షాకాలంలో నీట మునిగే ముప్పు ఈ కాల‌నీల‌కు త‌ప్పుతోంద‌ని స్థానికులు సంతోషం వ్య‌క్తంచేశారు. ఆటంకాలు తొల‌గాయి క‌నుక‌.. ఎస్ ఎన్ డీపీ నిర్వాహ‌కులు ఈ ప‌నులు వెంట‌నే పూర్తి చేయాల‌ని స్థానికులు కోరారు.

Latest