మంచిర్యాల, మహా : కాటమయ్య రక్షా కిట్ల ద్వారా గీతా కార్మికులకు 80 శాతం ప్రమాదాల నివారణ జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ పురుషోత్తం లతో కలిసి గౌడ కులస్తులకు కాటమయ్య రక్షా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం గౌడ కులస్తుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కాటమయ్య రక్షా కిట్లను పంపిణీ చేస్తుందని తెలిపారు. కాటమయ్య రక్షా కిట్ల ద్వారా 80 శాతం వరకు ప్రమాదాలు తగ్గాయని వెల్లడించారు. కాటమయ్య రక్షా కిట్లపై శిక్షణ పూర్తి చేసుకున్న 19 మంది గౌడ కులస్తులకు కిట్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గౌడ కులస్తులు కాటమయ్య రక్షా కిట్లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆబ్కారీ- మద్యనిషేధ శాఖ సి.ఐ. సమ్మయ్య, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సురేష్, నరేష్, శ్రీధర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.








