రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేట్ రెవెన్యూ పరిధిలో ఫార్మా రైతుల కోసం కేటాయించిన ప్లాట్లను, డ్రా పద్ధతి ద్వారా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఫ్యూచర్ సిటీ అథారిటీ చైర్మన్ శాశంకతో కలిసి ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… విషం చిమ్మే ఫార్మాసిటీ వద్దని తాను మొదటి నుంచి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేశానని ఆ పోరాట ఫలితంగా కాలుష్యం వెదజల్లే ఫార్మాసిటీ కాకుండా గ్రీన్ ఫార్మసిటిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని ఇక్కడి భూములు బంగారం కంటే విలువైనవిగా మారుతాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని దేశంలోనే అతిపెద్ద సీటీ గా పూర్తిగా ఈ ప్రాంతం అవతరిస్తుంది. ఈ ప్రాంతం నుంచి రేడియల్ రోడ్డు వెళుతున్నందున ఫార్మా రైతుల కోసం ఏర్పాటుచేసిన లేఔట్ లో ధరలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలు ఉన్నాయని, రైతులు తక్కువ ధరలకు ప్లాట్లు అమ్ముకోవద్దని ఆయన రైతులకు సూచించారు. అలాగే ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం సేకరించిన 2500 ఎకరాల పట్టా భూముల రైతులను కూడా త్వరలో పిలిపించి వారితో మాట్లాడి ఒప్పించి మెప్పిస్తామని అన్నారు. రైతుల కోరుకునే విధంగా పరిహారం అందిస్తామని ఆయన తెలిపారు. *నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూముల రైతులకు కూడా అన్ని రకాలుగా న్యాయం చేస్తామని గిట్టని వారు చేస్తున్న విషప్రచానాన్ని నమ్మవద్దని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం, కందుకూరు ఆర్డివోలు అనంత రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, డీసీపీ సునీత రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.








