Mahaa Daily Exclusive

  ఫార్మా రైతులు ప్లాట్లను అమ్ముకోవద్దు జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

పారదర్శకంగా, వంద శాతం హక్కులతో ప్రభుత్వం ఫార్మా రైతులకు ఇంటి స్థలాలను అందజేస్తుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు.
ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఇంటి స్థలాలను అందించాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మకమైన కార్యక్రమాన్ని, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమానికి, టీజీఐఐసీ యం.డీ. కె.శశాంక్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి హాజరై, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి రైతులకు ఇంటి స్థలాలు అందజేయడం జరిగింది.

లాటరీ పద్ధతిలో ఇంటి స్థలాల కేటాయింపు….
కందుకూరు మండలం మీర్ఖాన్ పేట్ రెవెన్యూలో ఏర్పాటు చేసిన లేఅవుట్లో యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని 7 గ్రామాలకు చెందిన భూ నిర్వాసితులకు, సోమవారం లబ్దిదారులైన వాళ్ల చేతుల మీదుగా లాటరీ టోకెన్ తీయించి తద్వారా ప్లాట్లను కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… అన్ని సదుపాయాలతో లేఅవుట్ను రూపొందించి ప్రభుత్వం రైతులకు విలువైన స్థలాలను అందిస్తుందని, అదే విధంగా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తూ రిజిస్ట్రేషన్ సైతం చేసి ఇస్తుందని తెలిపారు. ఇదే లేఅవుట్ నుంచి భవిష్యత్తులో రేడియల్ రోడ్డు వస్తోందని, రైతులు ఎవరూ ప్లాట్లను అమ్ముకోవద్దని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ అక్కడే ప్రత్కేంగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. మొదటి రోజు 670 మంది రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించారు. ఈ ప్లాట్ల కేటాయింపు కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు జగదీశ్వర్ రెడ్డి, అనంతరెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Latest