కొణిజర్ల, మహా.
“పేదల కోసం, ప్రజల హక్కుల కోసం కమ్యూనిస్టులు పోరాడటం చరిత్ర. ఇప్పుడు మళ్లీ అదే చరిత్రను ప్రజల సమక్షంలో తిరిగి రాసే సమయం వచ్చిందనీ కొత్తగూడెం శాసనసభ్యుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం
కొణిజర్ల మండలంలోని తనికెళ్ల గ్రామంలో నిర్వహించిన సీపీఐ 18వ మండల మహాసభలు ప్రజాశక్తి నినాదాలతో హోరెత్తాయి. . సభకు ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ్యుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, “పేదల కోసం, ప్రజల హక్కుల కోసం కమ్యూనిస్టులు పోరాడటం చరిత్ర. ఇప్పుడు మళ్లీ అదే చరిత్రను ప్రజల సమక్షంలో తిరిగి రాసే సమయం వచ్చింది” అని హుశారుగా పేర్కొన్నారు.
ఆపరేషన్ కగార్ లాంటి క్రూరమైన చర్యలకు వ్యతిరేకంగా మొదట మాటలదీ మనదేనని స్పష్టం చేసిన సాంబశివరావు, అడవుల్లోని నిరాయుధ గిరిజనులపై హింస కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎర్రజెండాలు ఒక్కటైతే, మరింత ఎరుపెక్కి ఎర్రకోట వరకు వెళ్తాయి,” అంటూ సంఘీభావం ప్రదర్శించారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో గళమెత్తి మాట్లాడాల్సినవాళ్లు రోడ్ల మీద తిరుగుతుంటే, జైళ్లలో ఉండాల్సినవాళ్లు పార్లమెంటులో కూర్చోవడం న్యాయమా అని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, సీపీఐ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ చేసింది పాపం, కాంగ్రెస్ చేస్తే పుణ్యమా అని నిలదీశారు.
జాతీయ కమిటీ సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ, కమ్యూనిస్టులకు ప్రజల్లో ఆదరణ ఎప్పటికీ తగ్గదని, మొన్నటి ఎన్నికల్లో మాత్రమే కాకుండా గతంలో వైరా నియోజకవర్గంలో పార్టీకి 38వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సీనియర్ నేత వింజం గోపాలకృష్ణయ్య అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. సభ ప్రాంగణానికి ‘యాసా పెద్దబ్బాయి’ పేరును నామకరణం చేసి, ఆదర్శ నాయకుడికి గుర్తుగా నిలిపారు. తనికెళ్ల గ్రామం దెబ్బతిన్నదన్న భావనను తుడిచిపెట్టేందుకు పార్టీ కార్యదర్శులు ప్రజల్లో నూతన జోష్ నింపే ప్రయత్నం చేశారు. “దెబ్బతిన్న పులిలా, ఎగిసిపడే సముద్ర కెరటంలా ఎర్రకెరటంలా, పార్టీ పూర్వవైభవాన్ని తిరిగిరావాలి,” అని ఆకాంక్షను వెలిబుచ్చారు.
1951 వరకు కమ్యూనిస్టులు అడవుల్లోనే తలదాచుకొని పోరాటాలు సాగించారని, తెలంగాణ సాయుధ పోరాటంలో 5000 మంది త్యాగవీరులు ప్రాణత్యాగం చేశారని సాంబశివరావు పేర్కొన్నారు. ప్రజలకు సొంత రాజ్యం ఇచ్చేందుకు సీపీఐ పోరాడిందని గుర్తుచేశారు. కమ్యూనిస్టు జెండా మోయడం అదృష్టం అని, ధైర్యం, త్యాగం, మానవతా గుణాలు లేనివాడు కమ్యూనిస్టుగా పనికిరాడని స్పష్టం చేశారు. “పిరికివాడు రోజూ చస్తూనే ఉంటాడు. ధైర్యవంతుడు చనిపోయినా బతుకుతాడు” అన్న మాటలు సభను స్ఫూర్తివంతంగా మార్చాయి. కమ్యూనిస్టు పార్టీ సముద్రంలాంటిదని, సముద్రానికి ఎట్టిపరిస్థితుల్లోను అంతుండదని, అదే తరహాలో కమ్యూనిజానికి మరణం లేదని స్పష్టంగా చెప్పారు.
ఈ నెల 19, 20 తేదీల్లో మధిర పట్టణంలో సీపీఐ జిల్లా మహాసభలు, ఆగష్టులో 19 నుంచి 23 వరకు మేడ్చల్ జిల్లాలో రాష్ట్ర మహాసభలు, సెప్టెంబరులో ఛత్తీస్‌గఢ్ లో జాతీయ మహాసభలు జరుగనున్నట్టు వివరించారు. పార్టీ నిబంధనల ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే సంస్కృతి ఎర్రజెండా పార్టీకి మాత్రమే ఉంటుందన్నారు. ఈ సభలో సీపీఐ వైరా నియోజకవర్గ ఇన్చార్జి యర్రా బాబు, రాష్ట్ర నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేష్, వ్యవసాయకార్మిక సంఘం నేత తాటి వెంకటేశ్వర్లు, మహిళాసంఘం నాయకురాలు తాటి నిర్మల, కొండపర్తి గోవిందరావు, ఏపూరి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.








