Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ లో..పదవుల జాతర.. -పార్టీ పదవులపై అనేక మంది ఆశావహుల్లో ఆశలు -జిల్లాలో భర్తీ కానున్న జిల్లా, మండల అధ్యక్ష పోస్టులు..!

Share

ఆదిలాబాద్, మహా
అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలకు మంచి రోజులు రానున్నాయి. త్వరలోనే పార్టీలో కీలక పదవులను నాయకులకు కేటాయించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఎవరికి పదవి ఇస్తే బాగుంటుందనే అంశంపై జిల్లాల వారీగా స్థానిక నాయకులు, ముఖ్య కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తాజాగా పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జీగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆదిలాబాద్ జిల్లాలో నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేయాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తుండగా.. తాజాగా పార్టీ పదవులను సైతం కట్టబెడితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది.

భర్తీ కానున్న కీలక పదవులు
గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు పదవులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది పూర్తయినప్పటికీ పదవుల భర్తీ లేకపోవడంతో నాయకులు, కార్యకర్తల్లో కొంత నిరాశ కనిపించింది. తాజాగా నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పరమైన పదవులు కూడా భర్తీ చేయాలని నిర్ణయించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువిరుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఖాళీగా ఉన్న జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున జిల్లా ఉపాధ్యక్ష పదవులు భర్తీ కానున్నాయి. వీటితో పాటు బ్లాక్ కు ఇద్దరి చొప్పున ప్రధాన కార్యదర్శి పదవులు, మండలానికి ఇద్దరి చొప్పున జిల్లా కార్యదర్శులు, ఒక కోశాధికారి, మరొకరికి స్పోక్స్ పర్సన్ పదవులు వరించనున్నాయి. వీటితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల అధ్యక్ష, కార్యదర్శి పదవులు కూడా భర్తీ కానున్నాయి. దీంతో ఇన్నాళ్లు ఎలాంటి పదవి లేకుండా కాంగ్రెస్ జెండా మోసి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన అనేక మంది నాయకులు వీటిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.

సామాజిక సమీకరణాలు పరిగణనలోకి..

సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు సూచనతో ప్రభుత్వం యంత్రాంగం ఇందుకనుగుణమైన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే 42శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకు కేబినేట్ తీర్మాణం కూడా చేసింది. ఈ క్రమంలో పార్టీ పదవులు కూడా భర్తీ చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వస్తుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే వారికి వివిధ పదవులు పొందిన వారు సహకరించేందుకు అవకాశం ఉండటంతో పాటు మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారనే ఆ పార్టీ అనుకుంటోంది. ఈ క్రమంలో మునుపటికి భిన్నంగా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకే పదవులు కట్టబెట్టాలని భావించడంతో కష్టపడి పనిచేస్తున్న ఆ పార్టీ నాయకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మండల అధ్యక్ష పదవులకు సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకొని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ జెండా మోసిన వారికి పదవుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో అభిప్రాయ సేకరణ పూర్తి కావడంతో ఈ నెల 15తేదీలోగా పదవులు ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎవరికి పదవి వరిస్తుంది.. ఎవరిని ఎంపిక చేస్తారు.. అనేది ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Latest