అశ్వారావుపేట, జూలై 12, మహా: పట్టణ అభివృద్ధి పనుల పేరుతో తవ్విన రహదారులను తాపకపోవడం వల్ల అశ్వారావుపేట వాసులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయినేజీ, సెంటర్ లైటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో, ప్రధాన వీధులు మురుగు నీటి నిల్వలతో మారుమూల గ్రామాల్లా కనిపిస్తున్నాయి. వర్షాకాలం మొదలైన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది.
రహదారులపై గుంతల పల్లకి
పట్టణంలోని ప్రధాన రహదారులే కాదు, కాలనీల్లోని వీధుల్లోనూ గుంతలు తీవ్రంగా ఉన్నాయి. వాహనదారులు గుంతలు తప్పించుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నడవాల్సిన పాదచారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. భద్రాచలం, జంగారెడ్డిగూడెం, ఖమ్మం రోడ్లు, ముఖ్యంగా రింగ్ రోడ్ ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమల బెడద ఎక్కువైంది.
ప్రమాదాలకు తెరలేపుతున్న నిర్లక్ష్యం
డ్రెయినేజీ పనుల కోసం ఉపయోగిస్తున్న మిషన్ వాహనాలు ట్రాఫిక్ మధ్యలో ఇష్టారీతిగా తిరుగుతున్నాయి. ఇటీవల నిర్లక్ష్యంగా వెనక్కి వెళ్లిన ఓ మిషన్ బండి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటన సంచలనం రేపింది. పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, చిన్నపిల్లలు లేదా మహిళలు ఉన్నట్లయితే దాని తీవ్రత మరింత ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్పందన లేని అధికారులు
పనులు చేపట్టిన మున్సిపల్, ఆర్ అండ్ బి శాఖలు ఎక్కడా స్పందించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇదేనా అభివృద్ధి? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజల డిమాండ్ – అసౌకర్యం తొలగించండి
వర్షాకాలం నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన రహదారుల వద్ద తవ్వకాలు పునరుద్ధరించి, గుంతలను పూడ్చి రహదారులను గమనయోగ్యంగా అభివృద్ధి చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో ఏడాదిగా సాగుతున్న తవ్వకాలు… ముద్దగా మారిన రహదారులు… చినుకు పడితే చిత్తడి, ఎండైతే దుమ్ము… ఇదేనా అభివృద్ధి? అని ప్రశ్నిస్తున్నారు అశ్వారావుపేట ప్రజలు.








