కారేపల్లి, మహా : ప్రజలకోసం ప్రాణాలకు తెగించి పోరాడిన అమరులు నిస్వార్ధ జీవులను వారు ప్రజల గుండెలలో చిరస్దాయిగా నిలుస్తారని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు గుగులోత్ తేజానాయక్ అన్నారు. ఈనెల 16న నిర్వహించనున్న అమరుల స్మారక సభలు, స్ధూపాల అవిష్కరణ కార్యక్రమాలపై శనివారం కారేపల్లి మండలం పోలంపల్లి, నాగయ్యగుంపు, పేరుపల్లి, జమాళ్లపల్లి, మల్లన్నగూడెం, గుంపెళ్లగూడెం, మాధారం, గోవింద్తండా, టేకులగూడెం, గాదెపాడు మాణిక్యారం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. స్మారక సభల వాల్ పోస్టర్లను అవిష్కరించారు. ఈసందర్భంగా గుగులోత్ తేజానాయక్ మాట్లాడుతూ రాయల చంద్రశేఖర్, ఎల్లన్న, గండి యాదన్న లు ప్రజాపోరాటాల ద్వారా పేదల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. పోలీసు నిర్బంధాలు, జైలు జీవితం, రౌడీ మూకల దాడులు ఎదుర్కొంటూ కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లను భరించి ప్రజాభివఅద్ధి కోసం సాయుధ మార్గాన్ని ఎంచుకొని పీడిత ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. నోరులేని ఆదివాసీలు, దళితులు ఇతర పేద వర్గాలు దోపిడికి గురవుతుంటే వారికి ప్రశ్నించడం నేర్పించారని కొనియాడారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరుల సాక్షిగా సీతారామ ప్రాజెక్టు నీళ్లు దక్కించుకోవటానికి ఏజన్సీ ఏకం కావలసిన అవసరం ఉందన్నారు. ఈనెల 16 న అమరుల స్మారక స్థూపాల ఆవిష్కరణ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో కారేపల్లి, కామేపల్లి సంయుక్త మండల కార్యదర్శి ధారావత్ సక్రునాయక్, నాయకులు హరిదాస్. గుగులోతు లక్ష్మణ్, పూలకాని సత్తిరెడ్డి,తాటి పాపారావు, కురసం వెంకటేశ్వర్లు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.








