ఆదిలాబాద్, మహా
అంగన్వాడి టీచర్లకు అదనపు పనులతో పాటు బిఎల్ఓ విధుల నుంచి మినహాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భం గా కిరణ్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు అనేక ఇబ్బందుల మధ్యన విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లు సరిగా పనిచేయడం లేదని కొత్త ఫోన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు అదనపు భారం నుండి విముక్తి కల్పించాలని అన్నారు ఇది వరకే ఐసిడిఎస్ పనులతో ప్రభుత్వాల కార్యక్రమాలతో పనిభారానికి లోనవుతున్నారని తెలిపారు. డ్యూటీతో ఈ భారం మరింత పెరుగుతోందని అంగన్వాడీ యూనియన్ పోరాటాల ఫలితంగా ఐసి డి ఎస్ శాఖ అంగన్వాడీలను ఐసి డిఎస్ యేతర పనుల నుండి మినహాయించాలని విడుదల చేసిన సర్క్యులర్ ను అమలుచేయాలని తెలిపారు. పీఎం శ్రీ పాఠశాలలను రద్దుచేసి ఆ బడ్జెట్ ను ఐసి డి ఎస్ కి కేటాయించాలి అంగన్వాడీలను ప్రభుత్వఉద్యోగులుగా గుర్తించాలని పేర్కొన్నారు. కనీస వేతనం రూ 26,000/- చెల్లించాలని పీ ఎఫ్,ఈ ఎస్ సౌకర్యాలు కల్పించాలని వివరించారు. ఇతర సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే. సునీత,జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, కోశాధికారి రత్నమాల, నాయకులు పార్వతి,రాధ, ఖుషివర్త, విజయ, నాగమణి, విశాఖ, సుజాత,లక్ష్మి, నజీమ తదితరులు పాల్గొన్నారు.








