తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన
ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.6,56,90,0097 కు సంబంధించిన చెక్కులను పంపిణి చేస్తున్నట్లు కూసుమంచి ఏపీఎం తిరుమలరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన చేతుల మీదగా మహిళలకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా నాలుగు మండలాలకు చెందిన మహిళలకు వడ్డీ రాయితీ కిందా రూ.5.62కోట్లు, లోన్ బీమా కిందా రూ.44.90లక్షలు, ప్రమాద బీమా కిందా రూ.5లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు.
* *మండలాల వారిగా చెక్కులు ఇలా
పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 4505మంది సమాఖ్య సభ్యులకు రూ.5.62కోట్లకు చెందిన వడ్డి లేని రుణాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. అందులో కూసుమంచి మండలంలో 969 మంది సభ్యులకు రూ.1.25 కోట్లు, తిరుమలాయపాలెం మండలంలో 1046 మంది సభ్యులకు గాను రూ.1.13కోట్లు, ఖమ్మం రూరల్ మండలంలో 1444మందికి రూ.1.81 కోట్లు, నేలకొండపల్లి మండలంలో 1040 మంది మహిళలకు రూ.1.43 కోట్లు వడ్డి లేని రుణాలు మంత్రి పొంగులేటి పంపిణి చేయనున్నారు.
* *56మందికి లోన్ బీమా చెక్కులు పంపిణీ
లోన్ బీమాకు సంబంధించి నియోజకవర్గంలో మొత్తం 56 మంది మహిళలకు రూ.44.90 లక్షలకు సంబంధించిన చెక్కులను పంపిణి చేయనున్నారు. అందులో కూసుమంచి మండలంలో 12మందికి రూ.8.22లక్షలు, తిరుమలాయపాలెంలో 12మందికి గాను రూ.8.08లక్షలు, ఖమ్మం రూరల్ మండలంలో 19మందికి రూ.17.70లక్షలు, నేలకొండపల్లి మండలంలో 13మందికి రూ.10.87 లక్షలు చొప్పున చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణి చేయనున్నారు. అలాగే 5మందికి ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఒక్కోక్కరికి ఒక లక్ష్య చొప్పున రూ.5లక్షలను పంపిణి చేయనున్నారు.
** భారీగా జనసమీకరణ
కూసుమంచి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణంలో జరిగే ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి భారీగా జనసమీకరణ చేసేందుకు ఒక వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరో వైపు అధికారులు, ఐకేపీ శాఖ ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి 5వేల మంది మహిళలను, 1000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం వచ్చిన తడవకుండా, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు ఈ సమావేశమునకు పెద్ద సంఖ్యలో హాజరు అయ్యే విధంగా జీవనజ్యోతి మండల సమైఖ్యాఏర్పాట్లు చేస్తున్నారు..








