బోనకల్, మహా.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన “ఇందిరా డెయిరీ” ప్రాజెక్టు… ఐకేపీ వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థిక ఉపాధి కల్పించాలన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కల… కానీ ఆ కలను నిధుల దోపిడీతో కొన్ని గ్రామదీపికలు చెదగొట్టిన ఘటన బోనకల్ మండలాన్ని కుదిపేసింది. బాధితుల న్యాయ కోసం చేసిన ప్రయత్నాలు, అధికారుల నిర్లక్ష్యం, అవినీతి బాధితుల నోటి మాటగా బయటపడుతోంది. రాపల్లి గ్రామంలో మహిళల నుంచి వసూలు చేసిన రూ. 31,500 మాయం కావడం, అయినా అధికారులు స్పందించకపోవడం, సీసీ అధికార నిర్లక్ష్యం ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మహిళల న్యాయ పోరాటానికి ఇది నాంది కావాల్సిందే.
బోనకల్ మండలంలోని రాపల్లి గ్రామంలో ఇందిరా డెయిరీ ప్రాజెక్టు నిధుల దుర్వినియోగం ఘోర రూపం దాల్చింది. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టులో గ్రామదీపికలైన బోలెం స్వాతి, మోదుగు కోటేశ్వరి పై డ్వాక్రా మహిళలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్కొక్కరినుంచి రూ.2,100 చొప్పున వసూలు చేసిన నిధులను స్వాహా చేశారని ఆరోపిస్తున్నారు.
ఈ నిధులను మహిళలు గేదెల రుణాలకు భాగంగా చెల్లించగా, రెండు నెలల తర్వాత ఐకేపీ కార్యాలయానికి వెళ్లి తమ చెల్లింపులు తెలియజేయగా, సీసీ శ్రీనివాసరావు “మీ పేర్లకు ఏ డబ్బులు రాలేదు” అంటూ చేతులెత్తేశారు. దీంతో మహిళలు ఆరు నెలలుగా ఐకేపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, అధికారుల నుంచి స్పందన లేకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
పూర్తిగా డబ్బులు ఇచ్చాం – కానీ రశీదు లేదు
బాధితులు తోట రేణుక, గంగదేవుల రాధ, దుద్దుకూరి ఉదయశ్రీ, బోలెం శ్రావణి, తదితరులు తమ వాదనను బలంగా వినిపించారు. “సీసీ ముందుగా గ్రామదీపికలకు డబ్బులు ఇవ్వమన్నారు. అలాగే చేశాం. ఇప్పుడు మాత్రం చెల్లించలేదని అంటున్నారు” అని తేల్చిచెప్పారు. “ఇదంతా కుట్రే అనిపిస్తోంది. డబ్బులు మాయం అయినా అధికారులకెంతలూ పట్టించుకోవడం లేదు. ఎవరి చేతుల్లోకి నిధులు పోయాయో తేల్చాల్సిందే” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఐకేపీ అధికారుల నిర్లక్ష్యం – న్యాయం కోసం ధర్నా హెచ్చరిక
నందిని గ్రూపులోని ఏడుగురు సభ్యులు కూడా తమ వంతుగా రూ.2,100 చొప్పున గ్రామదీపికలకు చెల్లించామని స్పష్టం చేశారు. విచారణ జరిగితే బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గ్రామదీపికలు నిధులను మాయం చేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నా, సీసీ శ్రీనివాసరావు స్పందించకపోవడం దారుణమని మహిళలు మండిపడ్డారు.
“సీసీకి దీనిలో పాత్రలేదంటే… ఆయన ఎందుకు గ్రామదీపికలపై చర్యలు తీసుకోవడంలేదు? ఇదేం వ్యవస్థ?” అని మహిళలు నిలదీశారు. తగిన సమయంలో స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, ఐకేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు.








