ఆదిలాబాద్, మహా
నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపిస్తే డబ్బులు రాలుతాయన్న నమ్మకంతో ఆదిలాబాద్ పట్టణంలో ఓ ముఠా ఘరాన మోసానికి తెర లేపింది. మోసగాళ్ళ వలకు చిక్కిన దాదాపు మూడు వందల మంది బాధితులు వారికి ఇరవై వేల రూపాయల చొప్పున డబ్బులు ముట్టచెప్పారు. తీరా మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు.ప్రముఖుల చేత డిజిటల్ మైక్రో ఫైనాన్స్ పేరిట ఏర్పాటు చేసి కార్యాలయాలు తెరిపించి నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. మోసపోయామని గ్రహించిన బాధితులు సదరు కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా కార్యాలయం మూసి ఉండటంతో ఆగ్రహించిన బాధితులు న్యాయం చేయాలని కోరారు. అనంతరం జిల్లా పొలిసు కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇంద్రవెల్లి మండలం శంకర్ గూడ కు చెందిన కృష్ణ వ్యక్తి పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఇటీవల డిజిటల్ మెక్రో ఫైనాన్స్ పేరిట సంస్థలను ఏర్పాటు చేశారు. ఉట్నూర్, జైనూర్ లోనూ బ్రాంచ్ లను ప్రారంభించి ప్రముఖులతో ఫోటోలు దిగి సోషల్ మీడియా లో హల్ చల్ చేశారు. రిమ్స్ ఆసుపత్రికి సైతం కోటి కి పైగా విలువ చేసే పరికరాలు ఇస్తున్నట్లు ప్రచారం జరిపారు. ప్రజా సేవ చేస్తున్నట్లు పైకి కనిపిస్తూనే లోపల నిరుద్యోగులకు టోకరా వేసే భారీ పన్నాగం పన్నారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి డ్రెస్ కోడ్ సాకుతో ఇరవై వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని, తిరిగి వేతనంలో ఆ నగదును జమ చేస్తామని నమ్మించారు. సదరు వ్యక్తి ప్రచారం చూసిన బాధితులు ఆయనను నమ్మి డబ్బులు ముట్టచెప్పారు. రెండు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో బుధవారం వచ్చి చూసేసరికి కార్యాలయానికి తాళం వేసి ఉంది. సంబంధిత వ్యక్తుల ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించి కార్యాలయం ఎదుట బైటాయించారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారని, ప్రచారాన్ని చూసే నమ్మి మోసపోయామని బాధితులు వాపోయారు. కృష్ణ అనే వ్యక్తి ఓ ఫౌండేషన్ పేరిట సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిసిందన్నారు. అదే నమ్మకంతో తాము డ్రెస్ కోడ్ కోసం రూ. 20 వేల రూపాయలు చెల్లించామని, తమకు న్యాయం చేయాలని కోరారు.








