మిర్యాలగూడ మహా
ఓ బ్యాంకు ఉద్యోగి అధికారుల అండతో తమ భూమిని ఆక్రమిస్తున్నాడంటూ అడవిదేవులపల్లి మండలం మొలకచర్ల గ్రామానికి చెందిన దళితులు దైద శ్రీనివాస్, దైద రమణ మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి మిర్యాలగూడ పట్టణం సబ్ కలెక్టరేట్ గేట్ ముందు పురుగుమందుల డబ్బాలు, పెట్రోల్ బాటిల్ తో న్యాయం చేయాలంటూ బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 158/153లోని ప్రభుత్వ భూమిలో ఏళ్ల తరబడి తాము కబ్జాలోఉన్నామని, భూమిపై గతంలో వైయస్ రాజశేఖర్రెడ్డి సిఎంగా ఉన్న సమయం లో తమకు పట్టాలు కూడా వచ్చాయన్నారు. కాగా తమ పక్కన ఉన్న భూమిని కొనుగోలు చేసిన బ్యాంకు ఉద్యోగి రామకోటి తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ రాత్రి వేళల్లో యంత్రాల సహాయంతో పొలం సరిహద్దులు చెరిపేస్తూ కబ్జా చేస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అడవిదేవులపల్లి తహసిల్దార్ కబ్జాదారునికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసి రామకోటికి అనుకూలంగా రిపోర్ట్ ఇస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్ పూర్తి స్థాయిలో విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం గేటు ముందు బైఠాయించడంతో సమాచారం అందుకున్న ఎఎస్ఐ బిక్షం, పోలీసులు, మిర్యాలగూడ తహసీల్దార్ సురేష్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్ రజనీకాంత్, సీనియర్ అసిస్టెంట్ మతీన్ లు ఆందోళనకారులతో మాట్లాడి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.








