Mahaa Daily Exclusive

  వన మహోత్సవం లక్ష్యాలను సాధించాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

Share

మంచిర్యాల , మహా : మంచిర్యాల జిల్లా కు కేటాయించిన వన మహోత్సవం లక్ష్యాలను సాధించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంతో పాటు అర్కెపెల్లి గ్రామంలోని మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మధుసూదన్ లతో కలిసి 2 వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించారని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల ఆవరణలలో, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలని ఆయన సూచించారు. అనంతరం పాఠశాల తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. విద్యార్థుల హాజరు శాతం పెంపొందించడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనుల పర్యవేక్షణ

మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఈ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మూత్రశాలల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Latest