మిర్యాలగూడ మహా
పట్టణ పరిధిలోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం.నారాయణ్ అమిత్ శనివారం ఆకస్మికంగా పరిశీలించారు.
కార్యాలయం రికార్డులను తనిఖీ చేసి, రికార్డు రూం, అన్ని విభాగాలను పరిశీలించారు. పై అంతస్తులో కార్యాలయం ఉన్నందున వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మరో భవనంలోకి మార్చాలని సబ్ కలెక్టర్ అమిత్ అన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ చేయుట కొరకు సంబంధిత శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసి) తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే రిజిస్ట్రేషన్ కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని సిబ్బందిని సూచించారు. రిజిస్ట్రేషన్ లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆదాయం ఎలా ఉంటుంది అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తున్నామని సబ్ కలెక్టర్ అమిత్ కు సబ్ రిజిస్ట్రార్ బలరాం యాదవ్ తెలిపారు.








