రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మహేశ్వరం డిసిపి సునీతా రెడ్డి అన్నారు. శనివారం విజిబుల్ పెట్రోలింగ్ లో భాగంగా, ఏడిసిపి, ఏసిపి కెపివి రాజుతో కలిసి డిసిపి ఇబ్రహీంపట్నం బస్టాండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ… శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని పోలీసులకు తెలిపారు. ఇబ్రహీంపట్నం బస్టాండ్ లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులతో డిసిపి మాట్లాడి బస్సుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక బద్ధంగా చదివి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. చెడు స్నేహాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువు పట్ల శ్రద్ధ చూపాలన్నారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆకతాయిల వేధింపులకు గురైతే 100కు గాని, షీటీంకు గాని ఫిర్యాదు చేయాలన్నారు. దృఢ సంకల్పంతో ఉన్నత చదువులు చదవాలని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని బాలికలకు సూచించారు. బాలికలు తమ ఫోటోలను వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా లాంటి మాధ్యమాలలో పెట్టడం వల్ల సమస్యలు ఎదురవుతాయన్నారు. సోషల్ మీడియా ప్రభావం తదితర అంశాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో సిఐలు మహేందర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, వేణుగోపాల్, కృష్ణంరాజు, నందీశ్వర్ రెడ్డి, మధు, ఎస్ఐలు నాగరాజు, చందర్ సింగ్, ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు








