Mahaa Daily Exclusive

  ఇరుకుగా మారిన ఆటోనగర్ రహదారి రహదారికి ఇరువైపులా భారీ వాహనాల పార్కింగ్ తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు రహదారి పైనే భారీ వాహనాలకు మరమ్మత్తులు ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ పోచమ్మ మైదాన్ నుంచి 80 ఫీట్ రోడ్డు ఆటోనగర్ మీదుగా హనుమాన్ జంక్షన్ కు వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం భారీ వాహనాల అక్రమ పార్కింగ్‌కు నిలయంగా మారింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంతో పాటు, ఇతర అంతర్గత రహదారుల వెంబడి కూడా లారీలు, క్రేన్లు, ట్రక్కులు, బస్సులు వంటి భారీ వాహనాలను నిలిపి ఉంచడంతో అటుగా వెళ్లే వాహనదారులు, స్థానిక వ్యాపారులు, పాదచారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పై సంబంధిత పోలీసులు, మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
ప్రమాదాలకు దారి తీస్తున్న పరిస్థితి
ఈ రహదారి పై భారీ వాహనాలు రోజుల తరబడి విచ్చలవిడిగా నిలపడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ రోడ్డు పై నిత్యం భారీ వాహనాల రద్దీ ఉంటుంది. సాయంత్రం వేళల్లో ముఖ్యంగా రాత్రి సమయాల్లో తగినంత విద్యుత్ దీపాలు లేకపోవడం, రోడ్డుపై అస్తవ్యస్తంగా నిలిపిన భారీ వాహనాలు సరిగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం గణనీయంగా పెరుగుతోందని వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా వచ్చే వాహనదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటోలు హఠాత్తుగా కనిపించే ఈ వాహనాలను తప్పించుకోవడానికి పక్కకు వెళ్లాల్సి వస్తోందని దీనివల్ల ఒకరికొకరు ఢీకొనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు, రోడ్డు పక్కన పాడైపోయిన వాహనాలను కూడా నెలల తరబడి వదిలేయడం వల్ల అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఈ వాహనాలు కేవలం పార్కింగ్‌కు మాత్రమే కాకుండా రోడ్డు భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల ఈ రోడ్డుపైనే జెసిబి లకు, భారీ వాహనాలకు మరమ్మతులు, సర్వీసింగ్ పనులు చేస్తుండటంతో మరమ్మతుల సామాగ్రి, పనిముట్లు రోడ్డుపైనే ఉండిపోయి, ట్రాఫిక్ మరింత అంతరాయం ఏర్పడుతోంది. ఇది ట్రాఫిక్‌ కు తీవ్ర ఆటంకం కలిగిస్తూ, నిత్యం చిన్నపాటి ప్రమాదాలకు దారితీస్తోంది.

సంబంధిత అధికారుల నిర్లక్ష్యం?

ఆటోనగర్‌ లోని భారీ వాహనాల డీలర్లు, విడిభాగాల దుకాణాలు, సర్వీసింగ్ సెంటర్లు, ఇతర చిన్న వ్యాపార సముదాయాల యజమానులు ఈ అక్రమ పార్కింగ్ కు ప్రోత్సహిస్తున్నారని వాహనదారులు, స్థానిక ప్రజలు వాపోతున్నారు. కొన్ని భారీ వాహనాలు దుకాణాల ప్రవేశ ద్వారాలను సైతం అడ్డగించడంతో వ్యాపారం చేసుకోవడమే కష్టంగా మారిందని చెబుతున్నారు. రోడ్డుపై నిలిపిన ఈ వాహనాలకు సరైన సర్వీస్ లైసెన్సులు ఉన్నాయా లేదా అనే సందేహాలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్రజలకు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నిత్యం ప్రమాదాలకు గురవుతున్న సంబంధిత పోలీసులు, మున్సిపల్ అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదన్న విమర్శలు గత కొంతకాలంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా, సంబంధిత అధికారులు కేవలం చోద్యం చూస్తున్నారని, ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తక్షణ చర్యలు అనివార్యం

ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆటోనగర్ ప్రధాన రహదారిపై అక్రమంగా నిలిపిన భారీ వాహనాలను యుద్ధప్రాతిపదికన తొలగించి, చట్టవిరుద్ధ పార్కింగ్‌లకు అడ్డుకట్ట వేయాలని, ట్రాఫిక్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యజమానుల పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏదో ఒక రోజు పెను ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు బలిగొంటే అందుకు బాధ్యత ఎవరు వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని వాహనదారుల తో పాటు ఆటోనగర్ ప్రజలు వేడుకుంటున్నా

Latest