మంచిర్యాల, మహా : ప్రభుత్వ పనులలో అవినీతి రహిత అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద వాక్యానించారు. ఆదివారం జిల్లా చెన్నూర్ మండలం, కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి పనులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించి అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో ఎలాంటి అవినీతి లేకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక మార్గాల ద్వారా ఆర్థిక స్వావలంబన పొందే విధంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించి ప్రోత్సహించడం జరుగుతుందని వివరించారు. మహిళా సంఘాలు తాము పొందిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే తిరిగి రుణ సదుపాయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని, బిల్లులు సకాలంలో అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి రాష్ట్రమంతా ప్రయాణించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. అర్హత గల లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో అంతర్గత రహదారులను అభివృద్ధి చేసి మండల కేంద్రాలకు అనుసంధానం చేయడం ద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందని తెలిపారు. చెన్నూర్ నుండి 5 నూతన బస్సు సర్వీసులను ప్రారంభించడం జరిగిందని, చెన్నూరు పట్టణంలో ఆర్ టి సి బస్ డిపో కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించామని తెలిపారు. సోమనపల్లి గ్రామంలో 200 కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నూతనంగా నిర్మించడంతో పాటు గత ఆరోగ్య కేంద్రాలలో వసతులను మెరుగుపరచడం జరుగుతుందని తెలిపారు. 18 నెలల కాలంలో సుమారు 500 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేయడం జరిగిందని, రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు మూడు నెలల సన్న బియ్యం ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో దాదాపు 8 వేల నూతన రేషన్ కార్డులు జారీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం సుమారు 256 స్వయం సహాయక మహిళా సంఘాలకు 25 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాల చెక్కులను అర్హులైన మహిళలకు అందించారు. చెన్నూర్, కోటపల్లి, భీమారం మండలాలలో నూతన రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.








