Mahaa Daily Exclusive

  భూపాలపల్లిలో జర్నలిస్టుల ధర్నా, రాస్తారోకో.. – దుర్భాషలాడిన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన..!

Share

భూపాలపల్లి, మహా:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. విలేకరులనుద్దేశించి దుర్భాషలాడిన ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముందు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు విలేకరుల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జర్నలిస్టులందరు ఏకమై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని తగు నిర్ణయాలను ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో జరిగిన మంత్రుల పర్యటన కార్యక్రమాలను ముకుమ్మడిగా బహిష్కరించారు. ఎమ్మెల్యే అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ విలేకరులను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు, ధర్నా సందర్భంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్థానిక సిఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తిలు చేరుకొని విలేకరు లకు నచ్చజెప్పి ధర్నాను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

Latest