ఆదిలాబాద్, మహా
అంగన్వాడీల హక్కుల సాధన కోసం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ &హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ ) నాయకత్వంలో అనేక సమరశీల పోరాటాలు నిర్వహించామని ,భవిష్యత్తులోనూ నిర్వహిస్తామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ &హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి .జయలక్ష్మి అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం యూనియన్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు సభ నిర్వహించారు. ఈ సందర్బంగా జయలక్ష్మి మాట్లాడుతూ అక్టోబర్ 11,12 తేదీల్లో ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ &హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు . మహాసభల జయప్రదానికి అంగన్వాడీ టీచర్లు ,హెల్పర్లు , ఉద్యమ శ్రేయోభిలాషులు ఆర్థిక ,హార్దిక సహాయ సహాకారాలు అందించాలని కోరారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అంగన్వాడీ ,కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక సమరశీల పోరాటాలు నిర్వహించిన ఘనత సంఘానికి ఉందన్నారు. నెలరోజుల సెలవులు , మినీ లను మెయిన్ టీచర్లుగా, అర్హత కలిగిన హెల్పర్లను టీచర్లుగా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ , అంతక్రియలకు సహాయం (మట్టిఖర్చులు ) లాంటి అనేక విజయాలు పోరాటాల ద్వారా సాధించుకున్నామని గుర్తు చేశారు . రాష్ట్ర మహాసభలను ఇదే స్పూర్తితో జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.
రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు
అక్టోబర్ 11,12 తేదీల్లో ఆదిలాబాద్ లో జరుగనున్న తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ &హెల్పర్స్ యూనియన్ 5వ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు . ఆహ్వాన సంఘం చైర్మన్ గా పి .జయలక్ష్మి ,గౌరవ అధ్యక్షులుగా దర్శనాల మల్లేష్ , అధ్యక్షులుగా వెంకటమ్మ , ప్రధాన కార్యదర్శిగా కే.సునీత కోశాధికారిగా రత్నమాల చీఫ్ ప్యాట్రన్స్ గా మంగ , త్రివేణి ,లలిత లు ఎన్నిక కాగా ప్యాటన్స్ గా అన్నమొల్ల కిరణ్ ,ముంజం శ్రీనివాస్ ,బొమ్మేన సురేష్ ,రంజిత్ లు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు ,సహాయకార్యదర్శులు ,కమిటీ సభ్యులుగా మరో 25 మందిని ఎన్నుకున్నారు.








