భూపాలపల్లి, మహా :
పంటలకు నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
మంగళవారం నానో యూరియా వినియోగం, ఎరువులు సక్రమ సరఫరాపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ, సహకార సంఘాల సీఈఓలు, ఇన్పుట్ డీలర్లు తో ఐడిఓసి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
రైతుల భద్రత, శాస్త్రీయ పద్ధతుల్లో సాగుకు ప్రోత్సాహం కల్పించే క్రమంలో నానో యూరియా వినియోగం పై విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో పాటు సహకార సంఘాల సీఈఓలను ఆదేశించారు.
నానో యూరియా వాడకం వల్ల మొక్కల పెరుగుదల బాగా ఉంటుందని, కావాల్సిన పోషకాలు అందడంతో పాటు శక్తి పర్యావరణహితమైనదని తెలిపారు. రైతులు దానివల్ల వ్యయాన్ని తగ్గించుకొని అధిక దిగుబడి సాధించగలరని వివరించారు. ప్రతి మండలంలో వ్యవసాయ అధికారులు, ఉద్యాన, సహకార సంఘాల సీఈవోలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఫీల్డ్ డెమో, గ్రామ సభల ద్వారా నానో యూరియా ప్రయోజనాలు రైతులకు తెలియజేయాలని సూచించారు. పురాతన విధానాలను మరిచి శాస్త్రీయ పద్ధతులను అవలంబించడమే రైతులకు మేలు చేస్తుందని, అందుకే ప్రతి రైతుకు ఈ సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డీలర్లు ప్రతి రోజు ఎరువులు నిల్వలు స్టాకు బోర్డులో వ్రాయాలని తెలిపారు.
యూరియా వ్యవసాయానికి కాకుండా ఇతర పనులకు మళ్లీస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలిపారు. రైతులను. ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని సమృద్ధిగా నిల్వలు
ఉన్నాయని రైతులు అపోహపడొద్దని తెలిపారు.
యూరియాను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు వినియోగించినా, కృత్రిమ కొరత సృష్టించినా, నిల్వలలో తేడా వచ్చినా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులపై రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 8977741771 లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూము నంబర్ 7893098307 నంబరు కు కాల్ చేసి రైతులు సమాచారం ఇవ్వాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీములు నిరంతరం ఎరువులు, విత్తన దుకాణాలు తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో 371 ప్రయివేటు డీలర్ దుకాణాలు, 10 సహకార సంఘాల ఎరువుల దుకాణాలు ఉన్నాయని సహకార, వ్యవసాయ అధికారులు తనిఖీలు చేస్తూ ప్రతి రోజు స్టాకు నిల్వలు ఈ పాస్ లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 3120 ఎకరాల్లో వరి, 90 వేలకుపైగా ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, ఆయా పంటలకు ఆగస్టు మాసం వరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎరుల దుకాణం యజమానులు దుకాణం ముందు తప్పనిసరిగా ఎరువుల నిల్వలపై బోర్డులను ఏర్పాటు చేయాలని ,అందరికీ తెలిసే విధంగా ఎరువుల వివరాలు ప్రదర్శించాలని, ఏరోజుకారోజు ఎరువుల స్టాక్ వివరాలను అబోర్డుపై నమోదు చేయాలని సూచించారు. ఎవరైనా ఎరువుల విషయంలో అక్రమాలకు పాటుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏఎస్పీ నవీన్ కుమార్, వ్యవసాయ అధికారి బాబు, సహకార అధికారి వాలియా నాయక్, మహదేవ పూర్ వ్యవసాయ శాఖ ఏడి శ్రీవ్యాల్, కోరమండల్ జిఎం సర్జన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








