ఖమ్మం,మహా.
జిల్లాలో ప్రైవేట్ వైద్య సంస్థలు నిబంధనలకు లోబడి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలన్న ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. దీనిలో భాగంగా జూలై 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఖమ్మం ఐడీఓసీ ప్రాంగణంలోని ప్రగతి మీటింగ్ హాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ అధ్యక్షతన ప్రైవేట్ ఆసుపత్రుల యాజమానులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించబడింది.
ఈ సమీక్షలో పి సి పీ ఎన్ డీ టీ యాక్ట్, యం టీ పి యాక్ట్, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ చట్టం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ఆసుపత్రుల నిర్వహణ ప్రమాణాలు, రోగుల భద్రత , ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ అధ్వర్యంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఆరోగ్య వ్యవస్థను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా ఈ సమీక్షను నిర్వహించినట్టు అధికారుల వర్గాలు తెలియజేశాయి.
సమావేశంలో డా. శ్రీజ మాట్లాడుతూ, జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిగా నిషేధించబడి ఉండగా, వాటిని జరిపిన వారు, జరిపించుకున్న వారు చట్ట ప్రకారం కఠిన శిక్షలకు గురవుతారని హెచ్చరించారు. ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా, ఆసుపత్రుల్లో “ఇచట లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడవు” అనే బోర్డులు స్పష్టంగా ప్రదర్శించాల్సిందిగా సూచించారు. అంతేకాకుండా, ప్రతి స్కానింగ్ సెంటర్ వద్ద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ధరల పట్టికలు ఉండాలని, నిబంధనల మేరకు సరైన రికార్డుల నిర్వహణ జరగాలని సూచించారు.
ప్రైవేట్ ఆసుపత్రుల పరిపాలనలో నాణ్యత ప్రమాణాలు అనుసరించాల్సిన అవసరం ఎంతో ముఖ్యమైందని డా. శ్రీజ పేర్కొన్నారు. వైద్యుల నైపుణ్యాలు, చికిత్సా విధానాలు, ఆసుపత్రుల్లో ఉన్న సౌకర్యాలు, అవసరమైన లైసెన్సులు, అగ్నిమాపక భద్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, ఇన్ఫెక్షన్ నియంత్రణ, ఫార్మసీలలో మందుల నిల్వ, గడువు తేదీల వంటి అంశాలను ప్రతి ఆసుపత్రి కచ్చితంగా పాటించాలన్నారు. ఆసుపత్రులకు గుర్తింపు ఉందో లేదో నిర్ధారించుకునే బాధ్యత ప్రభుత్వ అధికారులదే కాకుండా, ఆసుపత్రి యాజమాన్యం తమ విధుల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆసుపత్రుల నిర్వహణలో పారదర్శకత ఉండాలనీ, ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనీ ఆమె స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రైవేట్ వైద్య రంగం భాగస్వామిగా ఉండాలని, వారానికి ఒక్కసారైనా ఉచిత వైద్య సేవలు అందించాలనీ సూచించారు. ముఖ్యంగా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా ఆసుపత్రులు ముందంజ వేసి చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి. కళావతిబాయి, ప్రోగ్రామ్ అధికారులు డా. వెంకటరమణ, డా. చందు నాయక్, డా. రామారావు, డా. సుబ్బారావు, డా. బిందుశ్రీ, డెమో సుబ్రహ్మణ్యం, ఐఎంఏకు చెందిన వైద్యులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమానులు, మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 519 ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మిగిలిన ఆసుపత్రులు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఆరోగ్య సేవలు నిబంధనల మేరకు అందించే విధంగా అన్ని ఆసుపత్రులు కట్టుబడి ఉండాలని, లోపాలు ఉన్న చోట వాటిని సకాలంలో సరిదిద్దుకోవాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని అడిషనల్ కలెక్టర్ డా. శ్రీజ పేర్కొన్నారు.







