Mahaa Daily Exclusive

  ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు స్ఫూర్తిని నింపిన జిల్లా మహాసభలు శత వసంతాల ముగింపు సభకు భారీ ఏర్పాట్లు -సిపిఐ జిల్లా కోశాధికారిగా కె. శ్రీనివాస్..!

Share

ఖమ్మం అర్బన్, మహా.

ప్రజా సమస్యల పరిష్కారానికి, సంక్షేమం అమలుకు నిరంతర పోరాటాలు, ఆందోళనలు నిర్వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా 23వ మహాసభలో నిర్ణయించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా పాలక వర్గాలు ఇచ్చిన హామీల అమలు కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందన్నారు. బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దండి సురేష్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు మధిరలోని పోటు ప్రసాద్ నగర్ లో జరిగిన సిపిఐ మహాసభ వివరాలను వెల్లడించారు. కార్యదర్శి, సహాయ కార్యదర్శితో పాటు పార్టీ కోశాధికారిగా కార్యాలయ కార్యదర్శి కె.

శ్రీనివాస్ ను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. 314 గ్రామశాఖలకు ప్రాతినిథ్యం వహిస్తూ 621 మంది ప్రతినిధులు హాజరయ్యారని ఇందులో 72 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారని మొత్తం ప్రతినిధుల్లో 50 శాతానికి పైగా యువత ఉండటం కమ్యూనిస్టు ఉద్యమంలో యువత భాగస్వామ్యం పెరగడం శుభ సూచకమన్నారు. 91 మందితో కౌన్సిల్ను ఏకగ్రీవంగా ఎన్నుకుని పార్టీ ఐక్యతను దాటామని ఆయన తెలిపారు.

మహాసభలలో మొత్తం 38 తీర్మానాలను ఆమోదించామని ఆ తీర్మానాల అమలుకు పోరాట కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఖమ్మంజిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం జరగడాన్ని సిపిఐ స్వాగతిస్తుందని అదే సమయంలో భములు కోల్పోతున్న రైతుల పరిహారం విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ప్రైవేటు మార్కెట్కు అనుగుణంగా భూములకు 2013 ఆర్ఆర్ చట్టం ప్రకారం ప్యాకెజీ ఇవ్వాలని లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించడం జరిగిందని సురేష్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం, 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే మిగిలిన ఆరు గ్యారెంటీలను తక్షణం అమలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహాసభ తీర్మానించిందని ఇందు కొరకు పార్టీ నిర్ణయానికి అనుగుణంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుందన్నారు. కళ్యాణలక్ష్మి లో తులం బంగారం, ఆసరా పింఛన్ రూ.4వేలకు పెంపు, రూ. 2,000 నెల నెల ఖాతాల్లో జమ చేసే పథకాలను అమలు చేయాలని ముఖ్యంగా రెండు లక్షల లోపు రుణాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, రైతు భీమా, పంటల భీమా పథకాలను అమలు చేయాలని మహాసభ తీర్మానించింది. జిల్లాల విభజన తర్వాత అవశేష ఖమ్మం జిల్లా వ్యవసాయ ప్రధాన జిల్లాగా మారిందని ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పాలని మహాసభ డిమాండ్ చేసిందని పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని కోరుతూ యువతను సమీకరించి పోరాట కార్యక్రమాన్ని చేపడతామని సురేష్ తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ డిమాండ్ చేయదంతో పాటు బిసిలకు 42 శాతం రిజర్వేషన్, వక్స్ చట్ట సవరణ, ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక నిధుల కేటాయింపు, అర్హులైన పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, జాతీయ ఉపాధి హామీ పథకం పని దినాల పెంపు, కనీస వేతన చట్టం అమలు. 282 జీవో రద్దు తదితర విషయాలపై చర్చించి తీర్మానాలను చేయడం జరిగిందని మహాసభలో ఆమోదించిన తీర్మానాలకు అనుగుణంగా పోరాటం చేయటం జరుగుతుందన్నారు.

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని భవిష్యత్తులో జర్నలిస్టులు జరిపే ఆందోళనకు పూర్తి మద్దతు నివ్వాలని మహాసభలో తీర్మానించడం జరిగిందని సురేష్ తెలిపారు. సిపిఐ శత వసంత సంబరాల ముగింపు సందర్భంగా ఐదు లక్షల మందితో జరుగుతున్న బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుంచి లక్ష మందిని సమీకరించాలనే లక్ష్యాన్ని తీసుకున్నట్లు సురేష్ తెలిపారు. సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి మాట్లాడుతూ మహాసభలో తీసుకున్న కార్యాచరణకు అనుగుణంగా కార్యక్రమాలు తీసుకుని క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలానా, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఎస్కి జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు బిజి క్లెమెంట్, తాటి వెంకటేశ్వరరావు, పుచ్చకాయల కమలాకర్, మేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.