మధిర, మహా.
మధిర మున్సిపాలిటీ పరిధితో పాటు మండలంలోని గ్రామాల్లో చెరువులు వాగులు కలిగిన గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. వాతావరణ శాఖ వెల్లడించిన విధంగా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే నేపథ్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధిర మండలం పై ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నదని తద్వారా ఆ నీరు లోతట్టు ప్రాంతాల మీదుగా చెరువులను చేరుతూ ప్రవహించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో తుఫాను వరదలు తాకిడికి ప్రభావితమయ్యే లోతట్టు ప్రాంతాలుగా ఉన్న ఎంప్లాయిస్ కాలనీ హనుమాన్ కాలనీ ముస్లిం కాలనీ ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతున్నదని, వర్ష ప్రభావం వాగుల ద్వారా మధిర వచ్చే వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులు మున్సిపల్ అధికారులు ప్రజలను కోరారు. ప్రస్తుతం పరిస్థితులను అధిగమించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు. మండల పరిధిలోని సిద్దినేని గూడెం గ్రామంలో చెరువు సమీపంలో వరద నీరు చేరడం వల్ల సమస్య తలెత్తిందని, మాటూరు పేట, మాటూరు వంగవీడు, చిలుకూరు ప్రాంతాలను పర్యవేక్షించడం జరుగుతున్నదని అధికారులు వెల్లడించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో విపత్తు నిర్వహణ సంస్థ యంత్రాంగం సూచనలతో మధిర నియోజకవర్గ పరిధిలో గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని అవసరమైన అన్ని ముందస్తు చర్యలను చేపడుతున్నట్లు నియోజకవర్గ పరిధిలోని మండల స్థాయి అధికారులు వెల్లడించడం గమనార్హం.
బుధవారం కురిసే వర్షం అంచనాలకు అనుగుణంగా మధిర పట్టణంలో ఎంప్లాయిస్ కాలనీ హనుమాన్ కాలనీ ముస్లిం కాలనీ కేసీఆర్ కాలనీ ముంపు పరిస్థితులకు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నదని, ఇప్పటికే రిహాబిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ అరిగెల సంపత్ కుమార్, తాసిల్దార్ రాళ్ల బండి రాంబాబు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, టౌన్ రూరల్ సిఐలు దోమల రమేష్, డి మధు, రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి తెలిపారు.








