ఖమ్మం,మహా.
లాభసాటి పంటలైన ఆయిల్ పామ్ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించాలని
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
రఘునాథపాలెం మండలం పరికలబోడు తండా గ్రామంలో బుధవారం మంత్రి పర్యటించి, 3 కోట్ల రూపాయలతో పరికలబోడు తండా నుండి రఘునాథపాలెం చింతగుర్తి జి.పి. రోడ్డు వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ మల్లేపల్లి క్రాస్ రోడ్ నుంచి పరికలబోడు, కొర్లపూడి క్రాస్ రోడ్డు నుంచి కొర్లపూడి తండా వరకు రోడ్ల నిర్మాణ పనులను నెలన్నర రోజులలో మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గుడిసెలలో నివసిస్తున్న నిరుపేదల ఫోటో తీసుకుని వస్తే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని అన్నారు.
రేషన్ కార్డులు పేదలకు అందేలా చూడాలని మంత్రి తెలిపారు. గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు అడిగితే తప్పనిసరిగా మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు. గతం నుంచి తనకు ఈ ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు.
గత ఖమ్మం అర్బన్ ప్రాంతాన్ని రఘునాథపాలెం మండలం ప్రత్యేకంగా తాను ఏర్పాటు చేశానని, 33 చెరువులకు ఎత్తిపోతల పథకం నుంచి నీరు తీసుకుని వచ్చానని, మిగిలిన ప్రాంతాలకు కూడా నీరు తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
నాగార్జునసాగర్ నుంచి నీరు రేపు విడుదల చేస్తున్నామని అవసరమైన చెరువుకు నీరు మళ్లించే అవకాశం ఉందని అన్నారు. రైతులు పామాయిల్, వక్క వంటి పంటలు సాగు చేసుకోవాలని వీటికి మిర్చి, పత్తి వంటి అంతర పంటలు వేసుకోవచ్చని అన్నారు.
పామాయిల్ సాగు చేస్తే ఎకరానికి 50 వేల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మొక్కలకు, అంతర్ పంటలకు, డ్రిప్ ఏర్పాటుకు సబ్సిడీ అందిస్తామని అన్నారు. 10 కిలోమీటర్ల దూరంలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందని, రైతుల పొలాల వద్దకే వచ్చి పంట కొనుగోలు చేస్తారని మంత్రి తెలిపారు.
పామాయిల్ పంట సాగు చేస్తే ఎకరానికి 2 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుందని అన్నారు. వేసవి కాలంలో కూడా రఘునాధపాలెం మండలంలో చెరువుల నింపే బాధ్యత తీసుకుంటానని, మంచి లాభ సాటి పంటలు రైతులు సాగు చేయాలని మంత్రి కోరారు.
పిల్లలు మంచి చదువులు చదివేందుకు రఘునాధపాలెం మండలంలో అద్భుతమైన పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని, స్వామినాథన్ సంస్థ ద్వారా పాఠశాల, యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలను స్థానికంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
మన పిల్లలు చదువుకొని ఉన్నత స్థితికి వెళ్తే మనం నిశ్చింతంగా ఉండవచ్చని అన్నారు. పిల్లలకు మనం ఇచ్చే అతి పెద్ద ఆస్తి చదువు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి సూచించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు నిరంతరాయంగా మంత్రివర్యులు కృషి చేస్తున్నారని అన్నారు. పామాయిల్ పంటను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే దిశగా నిర్విరామ కృషి చేస్తున్నారని అన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో నూతనంగా 3992 రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేసిందని, రఘునాథపాలెం మండలంలో 980 కుటుంబాలకు రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు.
అనంతరం మంజూరైన నూతన రేషన్ కార్డులను గ్రామంలోని మహిళలకు అందజేశారు.
అంతకుముందు మహిళలు కోలాటం, బంజార నృత్యం చేస్తూ మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఆత్మ కమిటీ చైర్మన్, పిఏసిఎస్ కమిటీ చైర్మన్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.








