మందమర్రి, మహా : ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, భూగర్భ గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద వాక్యానించారు. బుధవారం మందమర్రి మండలం అందుగుల పేట పంచాయతీ సాయి మిత్ర ఫంక్షన్ హాల్ లో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిర మహిళా శక్తి సంబరాలు 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వివేకానంద, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్యలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పేద ప్రజల కొరకు అభివృద్ధి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ ఫలాలను అర్హులైన పేదలకు అధికారులు సమన్మయంతో పంచాలని కోరారు. మహిళ సాధికారత కొరకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. ఇప్పటికే మహిళలకు వడ్డీ లేని రుణ సదుపాయాలను బ్యాంకు లింకేజీ ద్వారా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తుందని వెల్లడించారు. గత సంవత్సరం బ్యాంకు లింకేజీ ద్వారా 468 కోట్ల రూపాయలు అందించినట్లు చెప్పారు. జైపూరు, మందమర్రి మండలాలకు చెందిన 1 వెయ్యి 31 స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 కోట్ల 35 లక్షల వడ్డీ లేని రుణాలు అర్థం చేసినట్లు పేర్కొన్నారు. మహిళలు చిన్న పరిశ్రమలతో పాటు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు వంటి వ్యాపారాలు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా 5 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయంతో ఏడు శాతం వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో 3882 కొత్త రేషన్ కార్డులు జారి చేసినట్లు చెప్పారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాంటీన్ల ఏర్పాటుకు సంఘాలకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు మహిళ సహాయక సంఘాలకు దాదాపు 50 లక్షల రూపాయలు అందించడం జరిగిందని చెప్పారు. జిల్లాలో 510 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం 7000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చేరికలలో స్వయం సహాయక సంఘాల పాత్ర బేస్ అని ప్రశంసలు కురిపించారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 6000 మంది మహిళలు రుణం పొంది యూనిట్లు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం 161 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 14 కోట్ల 80 లక్షల రూపాయల రుణ సదుపాయం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.








