వరంగల్ మహా;
రైల్వే స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి రవాణాకు ప్రయత్నిస్తున్న ఒడిశా దంపతులను ఇంతె జార్గంజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 18 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు రూ 9 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే…
బుధవారం ఉదయం ఇంతజార్గంజ్ పోలీసులు వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని రవి టిఫిన్ సెంటర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నలుగు పెద్ద బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించిన ఒక మగ, ఒక ఆడ వ్యక్తిని గుర్తించారు. పోలీసులు వారిని తనిఖీ చేయడానికి ప్రయత్నించగా, వారు భయంతో పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు.
విచారణలో, నిందితులు ఒడిశాలోని గజపతి జిల్లా, కట్టంగుమా గ్రామానికి చెందిన భార్యాభర్తలైన జులియం బెహరా (60), జులియం కుమారి బెహరా (55) అని తేలింది. వీరు హిందీ, ఒడియా భాషలు మాట్లాడుతున్నారు. వారి బ్యాగులను తనిఖీ చేయగా, అందులో పంజరులతో నిండిన 18 కిలోల ఎండు గంజాయి బయటపడింది.
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అయితే సరైన ఆదాయం లేకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు గంజాయి వ్యాపారం ఎంచుకున్నామని నిందితులు పోలీసులకు తెలిపారు. ఒడిశాలోని తమ గ్రామం వద్ద గుర్తుతెలియని వ్యక్తి వద్ద ఈ గంజాయిని కొనుగోలు చేసి, సోలాపూర్‌లో కిలో ₹50,000 చొప్పున విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
వీరు సోలాపూర్‌కు వెళ్లేందుకు టికెట్ లేకుండా జనరల్ బోగీలో రైలులో ప్రయాణిస్తుండగా, వరంగల్ రైల్వే స్టేషన్లో టీటీ (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) తనిఖీకి వస్తున్నాడని భయపడి రైలు దిగిపోయినట్లు చెప్పారు. ఆ రైలు వెళ్లిపోవడంతో, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురుచూస్తూ రైల్వే స్టేషన్ ఎదుట టిఫిన్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడినట్లు వివరించారు.
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని వరంగల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ గంజాయి దందాను ఛేదించడంలో ఇంతజార్గంజ్ సీఐ సుకుర్, ఎస్సైలు నీలోజు వెంకటేశ్వర్లు, తేజ, ఏఎస్ఐ భిక్షపతి తో పాటు ఇతర పోలీసు సిబ్బంది సమర్థవంతంగా పనిచేశారని వరంగల్ ఏఎస్పి శుభం ప్రకాష్ తెలిపారు.








