భూపాలపల్లి, మహా :
భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
పొంగుతున్న వాగులు,చెరువులు,నదిలోకి వెళ్ళొద్దని తెలిపారు.
సెల్ఫీలు,రీల్స్ చేయడానికి వెళ్ళొద్దని పటిష్ట పర్యవేక్షణ చేయాలని యంత్రాంగానికి సూచించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని తెలిపారు.వర్షంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, సెల్ టవర్లు,చెట్ల కింద నిలబడరాదని విద్యుత్ ప్రమాదం జరిగే ఆవకాశం ఉంటుందన్నారు.
. విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడంతో విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లు తదితర వాటిని తాకరాదని హెచ్చరించారు.
వర్షాల కారణంగా చెట్లు కొమ్మలు, వాహనాలు, భవనాలపై విద్యుత్ తీగలు పడే ప్రమాదం ఉండడంతో అలాంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
డ్రెయినేజీ, నాలాలు పొంగిపొర్లే ప్రాంతాలు, వరద పారుతున్న సందర్భాలలో పిల్లలను వెళ్లకుండా నియంత్రణ చేయాలని, తగు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. వాగులు, వంకలు, చెరువుల వద్దకు పిల్లలు, పెద్దలు వెళ్లకుండా ఉండాలని తెలిపారు.
పశిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసిస్తున్నవారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సహాయం కోసం లేదా ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు కంట్రోల్ రూమ్ నంబర్ 9030632608
కు కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలు పిడుగు పడే సమయాల్లో జాగ్రత్తలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
కారుమబ్బులు కమ్ముకుని, భారీ శబ్దాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే మెరుపులు, శబ్దాలు వస్తున్నాయంటే పిడుగులు పడతాయని గుర్తించి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పిడుగుపాటుకు ప్రజలు, పశువులు మరణిస్తున్నారని, ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల్లో, చెట్లకింద ఉండే వారు పిడుగుపాటుకు గురవుతున్నారని తెలిపారు.
ప్రజలు పిడుగు పడే అవకాశం ఉన్నప్పుడు బయట తిరగక పోవడం మంచిదని , ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు బయటకు వెళ్లక కుండా ఇంటిపట్టునే ఉండాలని తెలిపారు.
పిడుగుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని,
లోహపు వస్తువులను చేతిలో పట్టుకోవడం మంచిది కాదని తెలిపారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదన్నారు.
పిడుగులు చెట్లపై లేదా విద్యుత్ స్తంభాల దగ్గర పడే అవకాశం ఉంది, కాబట్టి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు నదుల్లో, వాగుల్లో, చెరువుల్లో స్నానం చేయడం మంచిది కాదని, భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలని అన్నారు.
పిడుగు పడినప్పుడు విద్యుత్ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి
ముడుచుకుని కూర్చోవాలన్నారు.
మోకాళ్లపై చేతులు, తలపెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవడం వల్ల పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం తక్కువగా ఉంటుందని వివరించారు. స్వీచ్ బోర్డ్ నుండి అన్ని కనెక్షన్లు తీసివేయాలని, షవర్ స్నానం, చేతులు, గిన్నెలు కడగడం వంటివి చేయకూడదని, ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలన్నారు.
ఎక్కువగా పిడుగుపాటుకు వ్యవసాయ పనులు చేసే రైతులు, ఆరు బయట పనిచేసే కార్మికులు , నీటి గొట్టాలు బిగించే సిబ్బంది, విద్యుత్ టవర్ల వద్ద పనిచేసే వారు, వాహనదారులు, పాదచారులు పిడుగుపాటుకు ఎక్కువగా గురవుతున్నారని జాగ్రత్తలు పాటించి ప్రాణాపాయం నుండి బయట పడాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు.








