Mahaa Daily Exclusive

  నిత్యం విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో తేడా వస్తే ఉపేక్షించేది లేదు –మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.!

Share

మంచిర్యాల, మహా : ప్రతి నిత్యం విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో తేడా వస్తే ఉపేక్షించేది లేదని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు.
శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, వసతి గృహ పరిసరాలను పరిశీలించి, మెస్ కమిటీ సభ్యులతో రోజువారి ఆహార పట్టిక అమలుపై వివరాలు అడిగి తెలుసుకుని, విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల పేరిట అన్ని ప్రభుత్వ పాఠశాలలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నిత్యవసర సరుకులు వినియోగించాలని, విద్యార్థులకు వేడి భోజనం, శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని తెలిపారు. వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని హాస్టల్ నిర్వాహకులకు సూచనలు చేశామని పేర్కొన్నారు. వసతి గృహంలో నెలకొన్న ఇతరాత్ర సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని వెల్లడించారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని సాయికుంటలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు సిహెచ్ దుర్గాప్రసాద్, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎం రవీందర్, వసతి గృహ సంక్షేమ అధికారి డి చందన సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.