కొత్తగూడెం, మహా .
సింగరేణి ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం—చుంచుపల్లి మండలం రుద్రంపూర్ డి.530 క్వార్టర్‌లో నివసించే వాకపల్లి వెంకటరమణ, సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు.
ప్రతిదినం మాదిరిగానే ఆమె ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లగా, ఇంట్లో ఎవరు లేకపోవడాన్ని దొంగలు అవకాశంగా తీసుకున్నారు. ఇంట్లోకి చొరబడిన వారు బీరువా పగులగొట్టి అందులోని 20 తులాల బంగారాన్ని, రూ.2 లక్షల నగదును అపహరించుకుపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
విషయం తెలుసుకున్న కొత్తగూడెం టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ డి.ప్రతాప్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకొని వేలిముద్రల నమూనాలను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తోంది.








